కరీంనగర్ జిల్లా వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెడికల్ కాలేజీ వచ్చేసింది. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ జిల్లాకు వైద్య కళాశాలను శనివారం మంజూరు చేయగా, ప్రభుత్వం వెంటనే పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఇంకా మౌలిక సదుపాయాల కల్పనకు 150 కోట్లు మంజూరు చేయగా, త్వరలోనే జిల్లా వైద్య నగరిగా మారబోతున్నది. తొలుత వంద సీట్లు మంజూరు చేయగా, కళాశాల జిల్లా ప్రధాన దవాఖానాలో ఏర్పాటుకాబోతున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి చేతులమీదుగా మంత్రి గంగుల కమలాకర్ జీవో ప్రతిని అందుకోగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లావాసుల ఏండ్లనాటి కల నెరవేరింది. మంత్రి గంగుల కమలాకర్ చాలా కాలంగా చేస్తున్న కృషి ఫలించింది. జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ప్రభుత్వ ప్రధాన దవాఖానాలోనే ఏర్పాటు చేస్తున్న ఈ మెడికల్ కళాశాలకు ప్రస్తుతం 100 సీట్లు కేటాయించింది. అంతే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.150 కోట్లు మంజూరు చేసింది. భవనాల నిర్మాణ బాధ్యతలను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించగా, ఫర్నీచర్ సమకూర్చే బాధ్యతలను టీఎస్ఎంఎస్ఐడీసీ హైదరాబాద్‌కు అప్పగించింది. ఇప్పటి వరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్తు పరిధిలో ఉన్న కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ కళాశాల ఏర్పాటుతో అనుబంధ దవాఖానాను అప్‌గ్రేడేషన్‌కు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చింది.
జీవోను అందుకున్న మంత్రి గంగుల
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాను బోధన హాస్పిటల్‌గా మార్చుతూ ప్రభుత్వం ఇచ్చిన జీఓ ఎంఎస్ నంబర్ 96 ప్రతిని శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్.. మంత్రి గంగుల కమలాకర్‌కు అందించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అనేది తన చిరకాలవాంఛ అని సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాకు మంజూరు కావడంపై మంత్రి గంగుల హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాను బోధన ఆసుపత్రిగా మార్చి సేవలు అందిస్తామని మంత్రి గంగుల స్పష్టం చేశారు..