కరీంనగర్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్థానిక కలెక్టరేట్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేశారు. నోటిఫికేషన్ విడుదలైన మంగళవారం నుంచి ఈ నెల 23 వరకు ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 24న నామినేషన్లు పరిశీలిస్తారు. 26 వరకు నామినేషన్ల ఉప సంహరణ ఉంటుంది. డిసెంబర్ 10న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జడ్పీ సమావేశ మందిరం, హుజూరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో, జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల ఎంపీడీవో కార్యాలయాల్లో, పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని ఎంపీడీవో కార్యాలయాల్లో, సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల జడ్పీ కార్యాలయంలో, హుస్నాబాద్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లకు వెసులుబాటు ఉండేలా 30 నుంచి 40 కిలోమీటర్ల వ్యవధిలో ఈ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లు ఓట్లు వేయవచ్చని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.