మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలో రూ. 918 కోట్లు విలువగల మెగా మెయింటెనెన్స్ రైల్వే డిపో ( Mega Maintenance Railway Depot) ప్రాజెక్టును కాజీపేట స్టేషన్ ఘన్పూర్ మధ్య తరలించేందుకు వరంగల్ ఎంపీ కడియం కావ్య ( MP Kavya ) కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్సీ తకళ్ళపల్లి రవీందర్ రావు (MLC Takallapalli Ravinder ) ఆరోపించారు.
సోమవారం మహబూబాబాద్ ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పుతామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆరోపించారు. మహబూబాబాద్ ఇంటికన్నె మధ్యలో ఏర్పాటు చేయాల్సిన పీవోహెచ్ ఆర్ఓహెచ్ ప్రాజెక్టును వరంగల్‌కు తరలించి పోయేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు.
దీనిని అడ్డుకునేందుకు రానున్న రోజుల్లో తీవ్రంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. త్వరలో అఖిలపక్ష భేటీ నిర్వహించి ఉద్యమ కార్యాచరణ నిర్వహిస్తామని తెలిపారు.
మహబూబాబాద్‌కు రావాల్సిన రైల్వే డిపోను వరంగల్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇది మహబూబాబాద్ జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించాలని, లేకపోతే ప్రజల మద్దతుతో
అడ్డుకుంటామని హెచ్చరించారు. మహబూబాబాద్ వెనుకబడిన గిరిజన జిల్లా అని, రైల్వే డిపో ప్రారంభమైతే 30 వేల ఉద్యోగావకాశాలు వస్తాయని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం ప్రజలు గెలిపించిన కాంగ్రెస్ నేతలే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు.
సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల విధానంఅధికారులకు కూడా అర్థం కాని విధంగా ఉందని ఎమ్మెల్సీ దుయ్యబట్టారు. సర్పంచ్ రిజర్వేషన్లలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల విధానం హాస్యాస్పదమైందని మండిపడ్డారు.