మహబూబ్‌నగర్ టౌన్, మార్చి 16 : రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల కబడ్డీ చాంపియన్‌గా మహబూబ్‌నగర్ జట్టు నిలిచింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో బుధవారం రాత్రి మహబూబ్‌నగర్-రంగారెడ్డి జట్ల ఫైనల్ మ్యాచ్ ఉత్కఠంగా కొనసాగింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. మహబూబ్‌నగర్ జట్టు రంగారెడ్డిపై 54-51 పాయింట్ల తేడాతో గెలిచింది. రంగారెడ్డి జట్టు రన్నర్‌గా నిలవగా.. మూడు, నాలుగో స్థానంలో వరంగల్, నల్లగొండ జట్లు నిలిచాయి. క్రీడాకారులు తరలిరావడంతో మైదానం క్రీడా పండుగను తలపించింది. విజేత జ ట్టుకు రూ.75 వేలు, రన్నర్ జట్టుకు రూ.50 వేలు, మూడు, నా లుగో స్థానంలో నిలిచిన వరంగల్, నల్లగొండ జట్లకు చెరో రూ.25 వేలు, ట్రోఫీ అందజేశారు. అంతకుముందు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. శాట్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, పీయూ వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సతీమణి శారద, శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీహిత విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. శాట్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి సహకారంతో జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తి చాటాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, కబడ్డీ సంఘం రాష్ట్ర సెక్రటరీ జగదీశ్‌యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాములు, నాయకులు కృష్ణమోహన్, జ్యోతి, రాజేశ్, జగన్మోహన్గౌడ్, వేణుగోపాల్, శ్రీనివాసులుగౌడ్, నిరంజన్‌రావు, రాంచందర్, వడెన్న, రాజవర్ధన్, పరశురాం, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.