ఆరోగ్యకరమైన జీవనశైలిని సాగించాలంటే.. గంటల కొద్దీ వ్యాయామం, కఠినమైన డైట్ పాటించాలని చాలామంది భావిస్తారు. కానీ, చిన్నచిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇవ్వగలవని తాజా అధ్యయనం ఒకటి చెబుతున్నది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధక బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ‘ఇ-క్లినికల్ మెడిసిన్’లో ప్రచురితమైన ఈ పరిశోధన కోసం.. యూకే బయోబ్యాంక్లో నమోదైన దాదాపు 60 వేల మంది ఆరోగ్యవంతుల జీవనశైలి వివరాలను ఎనిమిదేళ్లకు పైగా విశ్లేషించారు. నిద్ర, శారీరక చురుకుదనం, ఆహారపు అలవాట్లు వంటి అంశాలు ఆయుష్షుపై ఎంత ప్రభావం చూపుతాయో పరిశీలించారు. ఇందులో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది.
రోజుకు కేవలం ఐదు నిమిషాలు అదనంగా నిద్రపోవడం, రెండు నుంచి మూడు నిమిషాలు ఎక్కువగా శారీరక వ్యాయామం చేయడం, భోజనంలో కొద్దిగా అదనపు కూరగాయలు చేర్చడం వంటి చిన్నచిన్న మార్పులే దీర్ఘకాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తేలింది. ఈ అలవాట్లను నిరంతరం కొనసాగిస్తే జీవితకాలం, జీవన నాణ్యత రెండూ మెరుగుపడే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. ఈ మార్పులకు దీర్ఘకాలంలో సగటున ఒక సంవత్సరం అదనపు ఆయుష్షుతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి ఎంతో చేస్తేనే ఆరోగ్యం అని కాదు.. ఇసుమంత చేసినా మన మంచికే! అని ఈ అధ్యయనం పునరుద్ఘాటిస్తున్నది. మరి మీరూ చేసుకుంటారా ఈ చిన్ని మార్పులు?!