కట్టంగూర్, మే 25 : నకిరేకల్ నియోజకవర్గంలో ఆటవిక పాలన నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిచారు. సోమవారం కట్టంగూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిరుమర్తి మాట్లాడుతూ.. వీరేశంకు రాజకీయంగా గుర్తింపు, ప్రజల్లో స్థానం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వమేనని అన్నారు. కాంగ్రెస్ పెద్దల మెప్పు కోసం కేటీఆర్, హరీశ్ రావుపై స్థాయికి మించిన వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శమని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వం లేకపోతే తను జైలులో ఉండేవాడివేనని ప్రజలకు బాగా తెలుసన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై మాట్లాడే ముందు తన రాజకీయ గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు.
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, రాజకీయాల్లో సంస్కారం పాటించాలని హితవు పలికారు. పదవులు, సంపాదన కోసం స్థాయికి మించి నీకు రాజకీయ బిక్ష పెట్టిన నాయకులపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో నర్ర రాఘవరెడ్డితో పాటు తామున్నపుడు మంచి వాతావరణం ఉండేదని, ఇప్పుడు అరాచక, ఆటవిక పాలన నడుస్తుందన్నారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసు పెట్టి వేదిస్తుంటే భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ ఫార్ముల, కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిటీ వేసినా వారి ప్రభుత్వ ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చి, ప్రజల పక్షాన, ప్రజల సంక్షేమం కోసం నిలబడేది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. నకిరేకల్ నియోజకవర్గఅభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే బీఅర్ఎస్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
నకిరేకల్ నియోజకవర్గంలో ఇంకా 30 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉందని చిరుమర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కోనుగోళ్ల విషయంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కేంద్రాలను సందర్శించి వెళ్లిన తరువాత కూడా కొనుగోళ్లు వేగవంతం కాలేదని విమర్శించారు. మంత్రులు రాకముందు తుకాల్లో ఎనిమిది కేజీల వరకు కటింగ్ చేసేవారని, వారు వచ్చిన తర్వాత అని 10 నుంచి 12 కేజీల వరకు పెరిగిందన్నారు. లారీ వెయిటింగ్ ఛార్జీల పేరుతో బస్తాకు అదనంగా రూ.10వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్న ఎమ్మెల్యే రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదని, అయన అనుచరులకు లాభం చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారే తప్పా రైతులకు భరోసా కల్పించే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో దళారుల దందా నడుస్తుదని, ఎమ్మెల్యే అనుచరులు ఇతర ప్రాంతాలు విజయవాడ, ఖమ్మం, ఛత్తీష్ ఘడ్ నుండి తక్కువ ధరలకు ధాన్నాని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రాత్రికిరాత్రే కాంటా వేసి మిల్లులకు తరలించడంతో స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కోట్ల నిధులతో రోడ్డు, ఆసుపత్రులు, అయిటిపాముల ప్రాజెక్టు, సెంట్రల్ లైటింగ్ తో పాటు ప్రతి పట్టణాన్ని, అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు. తాను తెచ్చిన నిధుల తోటి కలెక్టర్ దగ్గర ప్రొసిడింగ్ లు మార్చి కొత్త ప్రొసిడింగ్ తెచ్చి ప్రజలను మభ్యపెడుతున్నావ్ తప్ప ఆయన చేసింది శూన్యమని తెలిపారు. రైతులు, ప్రజల కోసం చూసే వ్యక్తి కాదని, తనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉండని, తన టార్గెట్ దాదాపు రూ.1500 కోట్లని ఇప్పుడిప్పుడే వెయ్యి కోట్లకు వచ్చిందిని చెప్పుకుంటున్నాడని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ్మ, మాజీ సర్పంచులు వడ్డె సైదిరెడ్డి, దాసరి సంజయ్ కుమార్, నాయకులు బాలనర్సయ్య, చౌగోని జనార్ధన్, అంతటి శ్రీనివాస్, యర్కల శ్రీనివాస్ పాల్గొన్నారు.