ప్రశాంత్‌నీల్‌తో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఆదివారం వెలుగు చూసింది. ఆ చిత్ర నిర్మాణసంస్థ మైత్రీమూవీ మేకర్స్ తన ఎక్స్(ట్విటర్)లో ఈ అప్డేట్ని పొందుపరిచింది. ‘ఎన్టీఆర్, కొరటాల శివతో మేం చేసిన ‘జనతా గ్యారేజ్’ విడుదలై ఎనిమిదేండ్ల కావొస్తున్నది. ఈ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వారిద్దరూ ‘దేవర-1’తో రాబోతున్నారు.
ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని ఆశిస్తున్నాం. అలాగే.. ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్‌తో మేం చేయనున్న భారీ ప్రాజెక్ట్‌ని కొన్ని నెలల్లోనే మొదలుపెట్టనున్నాం. ఈ విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నాం’ అని ఎక్స్ ద్వారా వారు తెలిపారు. ఇదిలావుంటే.. కర్ణాటకలోని ఉడిపి దేవాలయ ప్రాంగణంలో ఎన్టీఆర్ మీడియాతో ముచ్చటించినప్పుడు..
‘ ‘కాంతార’ ప్రీక్వెల్‌లో మీరు నటిస్తారని జాతీయ మీడియాలో గత కొన్ని రోజులుగా కథనాలు వస్తున్నాయి. వాటిలో నిజమెంత? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘రిషబ్శెట్టే దానికి ప్లాన్ చేయాలి. ఆయన ప్లాన్ చేస్తే చేయడానికి నేను రెడీ..’ అన్నారు తారక్. ఈ రెండు విషయాలకూ సంబంధం లేకపోయినా.. తారక్ అభిమానులకు మాత్రం ఇవి శుభవార్తలే.