ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమాకు ముహూర్తం సిద్ధమైంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ 30గా పిలుస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 7 నుంచి లాంఛనంగా ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రంలో ఆలియాభట్ నాయికగా ఎంపికైంది. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు కూర్చనున్నారు. ఈ సినిమా రాజకీయ నేపథ్యంగా తెరకెక్కనుందని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ గతంలో మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని రాజకీయ నేపథ్య చిత్రంగా రూపొందించారు. ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాలోనూ కొరటాల పొలిటికల్ థ్రిల్లర్ కథను నేపథ్యంగా ఎంచుకున్నారట. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో 2016 లో ‘జనతా గ్యారేజ్’ సినిమా రూపొందింది. ఈ సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో కొత్త చిత్రంపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ , బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్న సినిమాల్లో నటించబోతున్నారు.