అలంపూర్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దక్షణ కాశీగా పేరుగాంచిన అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో జోగుళాంబ దేవీ మూడో రోజు చంద్ర ఘంటా దేవీగా భక్తులకు దర్శమిచ్చింది. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు నిత్య పూజా హోమాలు నిర్వహించిన అనంతరం యాగశాల మరియు ఆలయానికి బలిహరణ సమర్పణ చేశారు. అనంతరం మాధ్యాహ్నిక అర్చన, నీరాజన మంత్ర పుష్పములు సమర్పించారు. అమ్మ వారికి సహస్రనా మార్చన. కుంకుమార్చనలు, శ్రీచక్ర నవావరణార్చన, తర్వాత యోగశాలలో చండీహోమం నిర్వహించారు.
మధ్యాహ్నం 12 గంటలకు నవాన్నసహిత మహానివేదన, భహక్తులకు ప్రసాద వితరణ గావించారు.సాయంత్రం అర్చకు లు అమ్మవారికి ఏకాంత ప్రదోశకాల పూజలు నిర్వహించి మహా మంగళ హారతి ఇచ్చారు. రాత్రి 7గంటల సమయంలో జోగుళాంబ దేవీని చంద్రఘంటా దేవీ అలంకరణలో కొలువు పూజ నిర్వహించారు. ఉత్సవ విగ్రహానికి దర్భారు సేవ, కుమారి సువాసినీ పూజలు నిర్వహించి మహా మంగళహారతి సమర్పించారు.
ఈ ఉత్సవాలను భక్తులు అసాంతం తిలకించి నేత్రానందం పొందారు. ఉత్సవాల సందర్భంగా అలంపూరు పట్టణ పరిసరా లు ఆధ్మాత్మిక వాతావరణంలో శోభిల్లుతున్నది. ఆలయ పరిసరాల్లో ఎప్పటికప్పుడు ఏర్పాట్లను ఆలయ ఈవో వీరేశం, చైర్మన్ రవి ప్రకాశ్‌గౌడ్, ధర్మకర్తలు, ఆలయాధికారులు పర్యవేక్షించారు.
ఆలయాలను దర్శించుకున్న ప్రముఖులు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురష్కరించుకుని శనివారం పలువురు ప్రముఖులు ఆలయాలను దర్శించుకున్నారు. వారిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ,మాజీ మంత్రి డీకే అరుణ, ఏసీబీ నాంపల్లి కోర్టు జడ్జి జయకుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారి, అమ్మవారి ఆలయాల్లో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి అశీర్వదించారు.
పసిడి వెలుగులు వెదజల్లుతూ చంద్ర రేఖలను శిరస్సులో ధరించి
నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారు చంద్ర ఘంటాదేవీగా భక్తులకు దర్శమిచ్చింది. నవరాత్రుల్లో పవిత్రంగా కొనసాగే ఉపాసనలో చంద్ర ఘంటాదేవీ ఆరాధన కల్యాణప్రదం. ఈ దుర్గను పూజించడం వల్ల దుష్టశక్తులు దూరమై దేవతా శక్తులు ఆరాధకుని ధరిచేరుతాయని భక్తుల నమ్మకం.
దుర్గకు సింహాం వాహనం కావడం చేత మాతను ఉపాసించే వారు సింహా పరాక్రమంతో నిర్భయంగా ఉంటారు. దుర్గామాత చేతిలో జపమాల, ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పాన పాత్ర త్రిశూలం, ధనుస్సు, కమండలం, గధ ధరించి మహా లావణ్య శోభలతో ప్రకాశిస్తుంది.