
అమెరికా సహా వివిధ దేశాల్లో భారతీయులు పెద్దసంఖ్యలో ఉన్నారు. దీంతో ఉగాది, దసరా, దీపావళి వేడుకలు అత్యంత భక్తి
శ్రద్ధలతో జరుపుకొంటున్నారు. కొన్ని దేశాల్లో అధికారిక సెలవులు కూడా ఇస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలోని ఇలినాయిస్, న్యూజెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియా నగరాల్లో దీపావళిని మహా సంబురంగా జరుపుతారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ నగరాల్లో భారత సంతతి ప్రజలు వరుస దీపాలు వెలిగిస్తారు. సింగ
పూర్లో దీపావళి ప్రభుత్వ సెలవుదినం. మారిషస్, మలేసియా దేశాల్లోని హిందువులకు కూడా పెద్ద పండుగే. మలేసియా రాజధాని కౌలాలంపూర్ ‘లిటిల్ ఇండియా’ ప్రాంతంలో వేడుక గొప్పగా జరుగుతుంది. ఇక్కడా సెలవు రోజే. స్థానిక రెస్టరెంట్లలో భారతీయ వంటకాలను ప్రత్యేకంగా వడ్డిస్తారు.
మన దేశంలో..
బెంగాలీలు దీపావళి రోజున కాళికాదేవికి మాంసం, చేపలు, మందార పూలు నివేదన చేస్తారు. ఒడిశాలో నేడు పితృదేవతలను స్మరించుకుంటారు. తమకు శుభం చేకూరడానికి పితరుల ఆశీర్వాదం కోరుకుంటూ జనపనార పుల్లలను దహనం చేస్తారు. లక్ష్మి, కాళి, గణపతిని ఆరాధిస్తారు. మహారాష్ట్రలో ఆవులను పూజించే ‘పశు బరస్’తో దీపావళి మొదలవుతుంది. మహారాష్ర్టులు భార్యాభర్తల బంధానికి నిదర్శనంగా ‘దివాలీ చా పడ్వా’ నిర్వహిస్తారు. వారణాసిలో దీపాల వెలుగులతో గంగా తీరమంతా మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. దేవ్ దీపావళి పేరుతో ప్రత్యేక గంగా హారతి ఇస్తారు. ఈ రోజున దేవతలు గంగలో స్నానం చేయడానికి దివి నుంచి తరలి వస్తారని నమ్మకం.