67వ జాతీయ అవార్డుల్లో మెరిసిన మహర్షి, జెర్సీ
జాతీయ ఉత్తమ జనరంజక చిత్రంగా ‘మహర్షి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రం ‘జెర్సీ’
సామాజిక ఇతివృత్తాలకు పెద్దపీట
వ్యవసాయం ఔన్నత్యాన్ని నేటి తరానికి తెలియజేస్తూ, విద్యాధికులు వారాంతపు వ్యవసాయంలో భాగం కావాలనే సామాజిక సందేశంతో రూపొందిన ‘మహర్షి’, విధి విసిరిన సవాళ్లను దృఢసంకల్పంతో ఎదుర్కొని జీవనపథంలో విజేతగా నిలిచిన యువకుడి స్ఫూర్తిదాయక పయనానికి హృద్యమైన దృశ్యరూపమైన ‘జెర్సీ’ ఈ ఏడాది జాతీయ చలన చిత్ర అవార్డుల్లో అగ్ర భాగాన నిలిచి తెలుగు సినిమా ఖ్యాతిని చాటాయి. ‘జెర్సీ’ ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా పురస్కారానికి ఎంపికైంది. నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో కూడా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. మహేష్‌బాబు కథానాయకుడిగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ జాతీయ ఉత్తమ జనరంజక చిత్రంగా అవార్డును గెలుచుకుంది. 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను సోమవారం ఢిల్లీలో ప్రకటించారు. మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన మలయాళ చిత్రం ‘మరక్కర్’ జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. జాతీయ ఉత్తమ నటుడిగా ‘అసురన్’ చిత్రానికిగాను ధనుష్, ‘భోంస్లే’ చిత్రానికిగాను మనోజ్ బాజ్‌పాయ్ ఎంపికయ్యారు. ఉత్తమ వినోదాత్మక చిత్రంతో పాటు ఉత్తమ కొరియోగ్రఫీ కేటగిరిల్లో ‘మహర్షి’ చిత్రం పురస్కారాల్ని గెలుచుకుంది.
జీవిత పయనంలో అశక్తుడై ఏనాడో వదులుకున్న లక్ష్యాన్ని తిరిగి సాకారం చేసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి కథగా ‘జెర్సీ’ చిత్రం మానవీయ ఇతివృత్తంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. గెలిచిన వాడిదే మాత్రమే జీవితం కాదు…గెలుపు కోసం సంకల్పబలంతో పోరాడిన వారందరూ కూడా విజేతలే అనే స్ఫూర్తిదాయక అంశం చుట్టూ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ కథను అల్లుకున్నారు. క్రికెట్ నేపథ్యంలో కుటుంబ భావోద్వేగాలు, కొడుకు కోసం తండ్రి పడే తపన, లక్ష్య సాధన కోసం విధిని ఎదిరించిన మనోబలంవంటి అంశాలు కలబోసిన ఈ సినిమా ఎమోషనల్ జర్నీలా ప్రేక్షకుల హృదయాల్ని స్పృశించింది. అర్జున్ పాత్రలో నాని పర్ఫార్మెన్స్కు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ సినిమాకుగాను ఎడిటర్ నవీన్నూలి జాతీయ ఉత్తమ ఎడిటర్‌గా అవార్డును అందుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
హలం పట్టిన ‘మహర్షి’
జాతీయ పురస్కారాల్లో మహేష్‌బాబు ‘మహర్షి’ చిత్రం మెరిసింది. ఉత్తమ జనరంజక చిత్రంతో పాటు ఉత్తమ కొరియోగ్రఫీ విభాగాల్లో జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నది. కార్పొరేట్ శక్తుల కారణంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కష్టాలకు వాణిజ్య హంగుల్ని మేళవిస్తూ దర్శకుడు వంశీపైడిపల్లి ఈ సినిమాను తీర్చిదిద్దారు. స్నేహితుడి లక్ష్యాన్ని నెరవేర్చడానికి అమెరికా నుంచి మాతృదేశానికి వచ్చిన ఓ కార్పొరేట్ కంపెనీ సీఈవో రైతు సమస్యలపై సాగించిన పోరాటాన్ని స్ఫూర్తిదాయకంగా ఈ సినిమాలో ఆవిష్కరించారు. కాలేజీ స్టూడెంట్‌గా, కార్పొరేట్ సీఈవోగా, రైతుగా, స్నేహితుడిగా భిన్న పార్శాలతో కూడిన రుషి పాత్రలో మహేష్‌బాబు అభినయానికి ప్రశంసలు దక్కాయి. ఇదే సినిమాకు రాజుసుందరం జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డుకు ఎంపికయ్యారు.
కంగనారనౌత్ నాలుగోసారి..
‘మణికర్ణిక’ ‘పంగా’ చిత్రాలకు గాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డును కైవసం చేసుకుంది కంగనారనౌత్. ఆమెకిది నాలుగో జాతీయ అవార్డు కావడం విశేషం. గతంలో ఫ్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను చిత్రాలకు కంగనారనౌత్ నేషనల్ అవార్డ్స్‌ను సొంతం చేసుకుంది. ఝాన్సీలక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా ‘మణికర్ణిక’ చిత్రాన్ని రూపొందించారు. క్రిష్, కంగనారనౌత్ దర్శకత్వం వహించారు. బ్రిటీష్‌వారిపై పోరాడిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధురాలి పాత్రలో కంగనారనౌత్ అద్భుతాభినయాన్ని కనబరిచింది. ఇక ‘పంగా’ చిత్రంలో తన ఆశయాలకు, కుటుంబ బాధ్యతలకు మధ్య నలిగే మధ్య తరగతి గృహిణిగా కంగనారనౌత్ తన పాత్రకు ప్రాణప్రతిష్ట చేసింది.
‘భోంస్లే’లో మనోజ్ అద్భుత నటన
వలసవాదుల పట్ల స్థానిక ప్రజలు, రాజకీయనాయకులు చూపే వివక్షను ఆవిష్కరిస్తూ రూపొందిన హిందీ చిత్రం ‘భోంస్లే’ లో రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్‌గా నటించిన మనోజ్ బాజ్‌పాయ్ జాతీయ అవార్డును దక్కించుకున్నారు.
‘అసురన్’ విశ్వరూపం
కులవివక్ష, భూస్వామ్య వ్యతిరేక పోరాటం వంటి సామాజిక అంశాల్ని స్పృశిస్తూ దర్శకుడు వెట్రిమారన్ తీసిన ‘అసురన్’లో అసమాన నటనను కనబరిచిన ధనుష్ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. తనకున్న కొద్దిపాటి భూమితో పాటు కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఆరాటపడే తండ్రి శివసామి పాత్రకు సహజ అభినయంతో ధనుష్ ప్రాణంపోశారు. నటుడిగా ధనుష్‌కు ఇది రెండో జాతీయ పురస్కారం కావడం విశేషం.
చారిత్రక వీరగాథ ‘మరక్కర్’
మోహన్‌లాల్ కథానాయకుడిగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ‘మరక్కర్’ (లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ) ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికైంది. చారిత్రక యుద్ధనేపథ్యగాథగా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పదహారో శతాబ్దానికి చెందిన కోజికోడ్ రాజు కుంజాలి మరక్కర్-4 మలబార్ తీరంలో పోర్చుగీస్ దండయాత్రను అడ్డుకున్న వీరుడిగా కీర్తిగడించారు. ఆయన సాహసోపేత వీరగాథను ఆవిష్కరిస్తూ ఈ సినిమాను రూపొందించారు. జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో ఈ సినిమా అవార్డుల్ని కైవసం చేసుకుంది. భారీ వ్యయంతో నిర్మాత ఆంటోని పెరుంబవూర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయబోతున్నారు.
జాతీయ అవార్డుల జాబితా
ఉత్తమ చిత్రం- మరక్కర్ (మలయాళం)
ఉత్తమ నటుడు-ధనుష్ (అసురన్), మనోజ్ బాజ్‌పాయ్ (భోంస్లే)
ఉత్తమ నటి-కంగనా రనౌత్ (మణికర్ణిక, పంగా)
ఉత్తమ సహాయనటి-పల్లవి జోషి (ది తాష్కెంట్ ఫైల్స్)
ఉత్తమ సహాయనటుడు-విజయ్ సేతుపతి (సూపర్ డీలక్స్)
ఉత్తమ దర్శకుడు-సంజయ్ పురన్ సింగ్ చౌహాన్(బహత్తర్ హోరైన్)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు-మత్తుకుట్టి జేవియర్(హెలెన్)
ఉత్తమ కొరియోగ్రఫీ-రాజు సుందరం (మహర్షి)
ఉత్తమ సంగీత దర్శకుడు-డి ఇమ్మాన్ (విశ్వాసం)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్-గిరీష్ గంగాధరన్(జల్లికట్టు)
పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్-మహర్షి
ఉత్తమ ఎడిటర్-నవీన్ నూలి (జెర్సీ)
ప్రాంతీయ చిత్రాలు
ఉత్తమ హిందీ చిత్రం -చిచ్చోరే
ఉత్తమ తెలుగు చిత్రం-జెర్సీ
ఉత్తమ తమిళ చిత్రం-అసురన్
ఉత్తమ జనరంజక సినిమాతో పాటు కొరియోగ్రఫీ విభాగాల్లో ‘మహరి’్ష, ఉత్తమ ప్రాంతీయ చిత్రంతో పాటు ఎడిటింగ్ విభాగాల్లో ‘జెర్సీ’ చిత్రానికి అవార్డులు రావడం ఆనందంగా ఉంది.
టి.ప్రసన్నకుమార్, గౌరవ కార్యదర్శి
‘67వ జాతీయ పురస్కారాల్లో ‘మహర్షి’ సినిమాకు అవార్డులు రావడం ఆనందంగా ఉంది. మహేష్‌బాబులాంటి అగ్ర కథానాయకుడిని ఎంచుకొని కమర్షియల్ హంగుల్ని, సామాజికాంశాల్ని సమన్వయం చేస్తూ దర్శకుడు వంశీపైడిపల్లి అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అశ్వనీదత్, పీవీపీలతో కలిసి ఈ సినిమాను నిర్మించాం. ఈ అవార్డు మా అందరిది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ విజయాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది. ఈ అవార్డుల ద్వారా వచ్చే నగదును మంచి పనుల కోసం వినియోగిస్తా’
‘నా జీవితంలో అత్యంత ఆనందదాయక క్షణాలివి. ఉత్తమ జనరంజక చిత్రంగా ‘మహర్షి’ సినిమాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది.తెలుగు ప్రేక్షకులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నా. వాణిజ్య హంగులకు సందేశాన్ని జోడించి తెరకెక్కించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడం వల్లే ఈ అవార్డు వచ్చింది. కథ విని తన కెరీర్లో ఉత్తమ సినిమాగా ‘మహర్షి’ నిలుస్తుందని మహేష్‌బాబు నాతో అన్నారు. ఆయన ఇచ్చిన నమ్మకంతోనే సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. మా విశ్వాసాన్ని ప్రేక్షకులు నిజం చేశారు.తెలుగు సినిమాకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా
‘జెర్సీ’ చేస్తున్నప్పు డు అవార్డుల గురించి ఆలోచించలేదు. ఈ అవార్డు మా టీమ్ అం దరికి లభించిన గౌరవం గా భావిస్తున్నా. ఎడిటిం గ్‌కు తక్కువ అవార్డ్స్ ఇస్తుంటారు. నిజానికి ఎడిటింగ్ సినిమాలో కీలకభూమిక పోషిస్తుంది. మా ఎడిటర్ నవీన్నూలికి అవార్డు రావడం ఆనందంగా ఉంది. మా చిత్రబృందమంతా ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం.