సాయి వెంకట్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. సుదర్శనం సాయిప్రసన్న, సుదర్శనం ప్రవళీకలు నిర్మాతలు. శనివారం హైదరాబాద్లో ఈ చిత్ర టైటిల్ లోగోను తిరుమలై కందాడై రామానుజ మఠం పీఠాధిపతి లక్ష్మణాచార్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయివెంకట్ మాట్లాడుతూ ‘జగద్గురు రామానుజం జీవిత చరిత్రను దృశ్యమానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వైష్ణవ తత్వాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన భగవత్ రామానుజ చరిత్రను ఆవిష్కరించడం అంత సులభం కాదు. ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు పరిశోధన చేశాను. రామానుజ ఆధ్యాత్మిక విశిష్టతను ఈ సినిమా ద్వారా తెలియజెప్పబోతున్నాం. ఇప్పటివరకు 25శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇందులో ఆరు పాటలు, పదకొండు శ్లోకాలు ఉంటాయి. త్వరలో శ్రీరంగం, కంచి, పెరంబుదూర్, బెంగళూరులో చిత్రీకరణ చేయబోతున్నాం. త్వరలో ఆడియో వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. జోశర్మ, అశ్వాపురం వేణుమాధవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: సుదర్శనం హేమలత, నిర్మాణ సంస్థ: సుదర్శనం ప్రొడక్షన్స్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: లయన్సాయి వెంకట్.