కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకురావడంతో గతేడాది నుంచి వ్యవసాయ మార్కెట్లకు ఆదాయం పడిపోయింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే చెక్‌పోస్టులు మూతబడ్డాయి. పంట ఉత్పత్తులు, పశువుల రవాణా ద్వారా వచ్చే సెస్ లేకుండా పోయింది. రైతుల ధర్నాతో దిగొచ్చిన కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దుచేయడంతో మార్కెట్లకు మళ్లీ జవసత్వం వచ్చింది. సూర్యాపేట జిల్లాలో 14 చెక్ పోస్టులకుగాను 11 తెరుచుకున్నాయి. 11 రోజుల్లో సెస్ ద్వారా రూ.32.54 లక్షల ఆదాయం మార్కెట్లకు సమకూరింది.
సూర్యాపేట, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రైతుల ఉద్యమ ధాటికి కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన విషయం విదితమే. ఒకవేళ ఆ చట్టాలు అమలై ఉంటే మొత్తం వ్యవసాయరంగం కార్పొరేటర్ల చేతికి వెళ్లి ఉండేదని మేథావులు పేర్కొంటున్నారు. కొత్త చట్టాల్లో రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర అంటూ ఎక్కడా పొందు పర్చకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుతం కొత్త చట్టాలు రద్దు కావడంతో మార్కెట్లకు పూర్వ రోజులు వస్తున్నాయి. మూసుకుపోయిన ఆదాయ మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఏడాది తరువాత మార్కెటింగ్ చెక్ పోస్టులు తెరుచుకున్నాయి. గత నెల 24న కేంద్రం చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా వెంటనే జిల్లాలో ఉన్న14 చెక్ పోస్టులకు గాను 11 తెరుచుకున్నాయి. మరో మూడు కూడా త్వరలోనే తెరువనున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.
ఒక్కటొక్కటిగా..
కేంద్రం వ్యవసాయ చట్టాలతో ఏడాదిగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే చెక్ పోస్టులు మూసుకుపోగా ఎక్స్పోర్టులకు ఇచ్చే అనుమతులు నిలిచిపోయాయి. గత నెల 24న సదరు చట్టాలను రద్దు చేయగా.. చెక్ పోస్టులు తెరుచుకుంటున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎక్స్‌పోర్టుకు అనుమతులు ఇస్తున్నారు. గతంలో జిల్లా వ్యాప్తంగా 14 చెక్ పోస్టులు ఉండగా ఇప్పటి వరకు 11 తెరుచుకున్నాయి. మార్కెట్లకు వచ్చే ఆదాయంతో గతంలో గ్రామాలకు లింకురోడ్ల నిర్మాణాలు కూడా చేసేవారు. నేడు ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తుండడంతో మిగిలిన ఆదాయంతో మార్కెట్లలో రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించనున్నారు.
మార్కెట్లకు పూర్వ వైభవం
కొత్త వ్యవసాయ చట్టాలతో మార్కెట్ యార్డులకు ఆదరణ కరువై పరిస్థితి దీనావస్థకు చేరి వాటి ఉనికే ప్రశ్నార్థకంగా మారేది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లలో అన్ని వసతులు కల్పించడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తున్నది. కొత్త చట్టాలు అమలై ఉంటే వ్యవసాయ మార్కెట్ వ్యవస్తే లేకుండా పోయేది. దీనికి వ్యతిరేకంగా రైతులు తెగబడి కొట్లాడి కేంద్రంతో చట్టాలు రద్దు చేయించాక మార్కెట్లకు తిరిగి పూర్వ వైభవం వస్తున్నది.
11 రోజులు… 32.54 లక్షలు
జిల్లాలో తెరుచుకున్న 11 చెక్ పోస్టుల ద్వారా పదకొండు రోజుల్లో మార్కెటింగ్ శాఖకు రూ.32.54 లక్షల ఆదాయం సమకూరింది. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వ్యాపారులు ఇతర ప్రాంతాలకు రవాణా చేయాలంటే మార్కెటింగ్ శాఖకు ఒక శాతం సెస్ చెల్లించాలి. చెక్ పోస్టుల వద్ద రుసుము చెల్లించి రశీదు పొందిన తర్వాత ఎక్కడికైనా రవాణా చేసుకోవచ్చు. వీటితో పాటు బయట పశువులను కొనుగోలు చేసినా ఒక శాతం సెస్ చెల్లించాల్సి ఉంటుంది. చెక్ పోస్టుల్లో సిబ్బంది రహదారులపై వెళ్లే వాహనాలను తనికీ చేసి వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల రవాణా చేసే వాహనాల వద్ద సెస్ వసూలు చేస్తున్నారు. జిల్లాలోని సూర్యాపేట, తిరుమలగిరి, హుజూర్నగర్, కోదాడ, నేరేడుచర్ల మార్కెట్ యార్డుల పరిధిలో ఉండే చెక్ పోస్టులను ఆయా మార్కెట్ కార్యదర్శులు నిరంతరం తనిఖీ చేస్తూ ఎవరైనా సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటుంటారు.
మార్కెట్లు ఉంటేనే రైతులకు ప్రయోజనం
మార్కెట్ యార్డులు ఉంటేనే వ్యాపారుల మధ్య పోటీ పెరిగి రైతులకు అనుకున్న దానికంటే ఎక్కువే ధర వస్తుంది. కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయడంతో మార్కెట్లకు పూర్వవైభవం వస్తున్నది. సూర్యాపేట మార్కెట్లో రైతుల ధాన్యానికి ధర బాగా వచ్చేలా వ్యాపారులతో మాట్లాడాం. ధాన్యం కింటా రూ.2200 వరకు పలుకుతున్నది. సెస్ రూపంలో వచ్చే ఆదాయంతో యార్డులో రైతుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం.