Jananayagan | కన్నడ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ సంస్థ నిర్మిస్తున్న రెండు భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా వాయిదా పడటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు భారీ అంచనాలున్న ‘టాక్సిక్’ సినిమా విడుదల వాయిదా పడగా, మరోవైపు దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా ఇంకా విడుదలకు నోచుకోలేదు. అయితే కేవీఎన్ ప్రొడక్షన్స్ , యష్‌కు చెందిన మాన్స్టర్ మైండ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘టాక్సిక్’ సినిమా మొదట మార్చి 19న విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ వాతావరణం వంటి కారణాల వల్ల ఈ చిత్రాన్ని జూన్ 4కు వాయిదా వేసినట్లు సమాచారం. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఇక మరో భారీ చిత్రం ‘జన నాయగన్’ కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా మొదట సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సమస్యల కారణంగా విడుదల ఆగిపోయింది. జనవరి 23న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ బోర్డు పరిశీలనలో చిక్కుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాను నేరుగా సర్టిఫికేట్ ఇవ్వకుండా రివిజన్ కమిటీకి పంపించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. అయితే చివరకు చర్చల అనంతరం సినిమాను రివిజన్ కమిటీకి పంపడానికి నిర్మాతలు అంగీకరించారు. దీని ప్రకారం, మార్చి 9న మధ్యాహ్నం 2 గంటలకు ‘జన నాయగన్’ సినిమాను సెన్సార్ రివిజన్ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
సినిమా చూసిన తర్వాత వారు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు, ఏ సన్నివేశాలను కట్ చేయాలని సూచిస్తారు, అలాగే సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇస్తారు అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే సినిమా విడుదలకు మార్గం సుగమం అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘జన నాయగన్’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం కూడా ప్రచారంలో ఉంది. ఈ చిత్రం తెలుగు హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కథలో కొన్ని మార్పులు చేసి, రాజకీయ నేపథ్యాన్ని కూడా చేర్చినట్లు సమాచారం. దళపతి విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకే సిద్ధాంతాలను ప్రతిబింబించేలా ఈ సినిమాలో కొన్ని డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలను విమర్శించే విధంగా కొన్ని సంభాషణలు ఉన్నాయని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కారణంగానే సెన్సార్ బోర్డు సినిమాను మరింత జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.