Jana Nayagan | కోలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న స్టార్ హీరో విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’కు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు ఆన్లైన్లో లీక్ కావడం సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై చిత్రబృందం వెంటనే స్పందిస్తూ, లీక్ అయిన కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని, సర్క్యులేట్ చేయవద్దని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు అధికారికంగా లీగల్ నోటీసులు కూడా విడుదల చేశారు. చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ తరఫున న్యాయవాది విజయన్ సుబ్రమణియన్ విడుదల చేసిన నోటీసులో, కొందరు వ్యక్తులు చట్టవిరుద్ధంగా సినిమా సన్నివేశాలను యాక్సెస్ చేసి డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ లీకులు సినిమా కమర్షియల్ విజయంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.
లీక్ అయిన వీడియోలను డౌన్లోడ్ చేయడం, ఫార్వార్డ్ చేయడం, షేర్ చేయడం, అప్లోడ్ చేయడం లేదా రీపోస్ట్ చేయడం మాత్రమే కాదు, వాటిని సేవ్ చేసుకోవడం కూడా కాపీరైట్ చట్టాల ప్రకారం తీవ్రమైన నేరమని నోటీసులో స్పష్టం చేశారు. ఈ చర్యల్లో పాల్గొనే ప్రతి ఒక్కరిపై వ్యక్తిగతంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ లీక్‌కు కారణమైన వ్యక్తులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలను వ్యాప్తి చేస్తున్న వారిని ట్రాక్ చేసి, వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అభిమానులు, ప్రేక్షకులు బాధ్యతతో వ్యవహరించి లీక్ కంటెంట్‌ను చూడకూడదని, పంచుకోవద్దని చిత్రబృందం విజ్ఞప్తి చేసింది.
ఇక ఈ చిత్రానికి హెచ్ వినోధ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా మొదట ఈ ఏడాది జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యలు, సెన్సార్ ప్రక్రియ ఆలస్యంతో విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీపై ఇప్పటికీ స్పష్టత లేదు.ఇంతలోనే కీలక సన్నివేశాలు లీక్ కావడం చిత్రబృందానికి పెద్ద షాక్‌గా మారింది. ముఖ్యంగా పెద్ద హీరో సినిమా కావడంతో పైరసీ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే మేకర్స్ వెంటనే అప్రమత్తమై, కఠిన లీగల్ చర్యలకు దిగారు. దర్శకులు ఎంతో కష్టపడి రూపొందించే సినిమాలను ఇలాంటి లీకులు తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. కాబట్టి ప్రేక్షకులు బాధ్యతతో వ్యవహరించి పైరసీకి దూరంగా ఉండాలని, సినిమాలను థియేటర్లలోనే ఆస్వాదించాలని చిత్రబృందం మరోసారి విజ్ఞప్తి చేసింది.