Jailer 2 | సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో రజినీకాంత్ తన స్టార్ పవర్‌ను మరోసారి నిరూపించారు.‘జైలర్’ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం సినిమాకు మరింత హైలైట్‌గా మారింది. ఈ మల్టీ-స్టార్ ఎలిమెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైందని, గ్లింప్స్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుందని సమాచారం. పార్ట్ 1లో కనిపించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఈ సీక్వెల్లో కూడా కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో, ‘జైలర్ 2’లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, అలాగే టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే షారుఖ్ ఖాన్ డేట్స్ సమస్యల కారణంగా ఈ ఆఫర్‌ను తిరస్కరించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలకృష్ణ ఎంట్రీ కేవలం రూమర్ మాత్రమేనని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలన వార్త తమిళ సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ‘జైలర్ 2’లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. మొదట షారుఖ్ ఖాన్ చేయాల్సిన పాత్రను ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయబోతున్నారని కొన్ని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ ఫ్యాన్స్ భారీ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. ఒకవేళ రజినీకాంత్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దద్దరిల్లిపోతాయని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న పవన్ కళ్యాణ్, తమిళనాడులో కూడా ప్రచారం నిర్వహిస్తూ అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ‘జైలర్ 2’లో కనిపిస్తే సినిమాకు భారీ హైప్ రావడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఇది నిజమా కాదా అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. కానీ అభిమానులు మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ నిజం కావాలని ఆశిస్తున్నారు.