Jagapathi Babu | ఒకప్పటి టాలీవుడ్ ఫ్యామిలీ హీరో, ప్రస్తుతం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్న జగపతి బాబు తాజాగా తన లుక్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా కోసం ఆయన పూర్తిగా మారిపోయిన కొత్త రూపం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు “ఇదేంటి ఇతను జగపతి బాబా?”, “సినిమా కోసం ఇలా మారిపోయాడా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు ‘అప్పల సూరి’ అనే కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఆ పాత్ర కోసం ఆయన బాగా బరువు తగ్గి, వయసు ముదిరిన వ్యక్తిలా కనిపించేలా ప్రత్యేక మేకోవర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా విడుదలైన సెట్స్ ఫోటోలో దర్శకుడు బుచ్చిబాబుతో మాట్లాడుతున్న జగపతి బాబు రూపం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఏ కోణంలో చూసినా ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోయారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జగపతి బాబు బర్త్ డే సందర్భంగా ఈ పిక్ రిలీజ్ చేశారు మేకర్స్. గతంలో కూడా జగ్గూ భాయ్‌కి సంబంధించిన పిక్ ఒకటి షేర్ చేయగా, అది కూడా నెట్టింట వైరల్ అయింది. ఇక జగపతి బాబు గతంలో కూడా పాత్ర కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి ‘పెద్ది’ కోసం తీసుకున్న మేకోవర్ మాత్రం మరింత విభిన్నంగా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన, తర్వాత విలన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస విజయాలతో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
ఇక రామ్ చరణ్ – జగపతి బాబు కాంబినేషన్ ఇప్పటికే ‘రంగస్థలం’ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరోసారి ఈ జోడీ ‘పెద్ది’లో కనిపించబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతుండగా, జగపతి బాబు పోషిస్తున్న పాత్ర ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ఉత్సుకత సినీ ప్రియుల్లో నెలకొంది. మొత్తానికి, ‘పెద్ది’ కోసం జగపతి బాబు చేసిన ఈ భారీ మేకోవర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.