హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవినీతి ఆరోపణలు చేయడాన్ని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా గర్హించింది. రోజూ రూ.10 కోట్లు తీసుకోనిదే సోమేశ్‌కుమార్‌కు నిద్ర పట్టదని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఐఏఎస్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ప్రజాసేవలో నిమగ్నమైన ఐఏఎస్ అధికారుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చులకనగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని వెంకట్‌రెడ్డికి హితవు పలికింది