నా వయసు నలభై నాలుగు. ఈ మధ్యే విడాకులు తీసుకున్నాను. ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నా. ప్రయాణాలంటే ఇష్టం. ఏదో సెమినార్లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వయసు ఇరవై తొమ్మిది. అందంగా ఉంటాడు. ఆకట్టుకునేట్లు మాట్లాడతాడు. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. తరచూ కలుసుకుంటాం. దూర ప్రాంతాలకు వెళ్తుంటాం. హఠాత్తుగా ఓ రోజు వచ్చి పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించాడు. ఇప్పటికిప్పుడే ఆ నిర్ణయం వద్దు. రెండేళ్ల తర్వాత ఆలోచిద్దాం అని చెప్పాను. అయినా వినడం లేదు. అతనితో కలిసి బతకడానికి నాకు సమస్య లేదు. భవిష్యత్తులో అతను ఇబ్బంది పడతాడని నా భయం. మీ సలహా ఏమిటి?
అతను పసివాడేం కాదు. చదువుకున్నాడు. ఉద్యోగం చేస్తున్నాడు. సమాజంలో గౌరవనీయమైన స్థానంలో ఉన్నాడు. అతని ప్రతిపాదనలో నిజాయతీ ఉంటే.. తప్పక అంగీకరించండి. ఇక భవిష్యత్తు అంటారా? మీ వయసుకు తగినవాడిని చేసుకున్నా కూడా.. రెండేళ్ల తర్వాత ఆ వ్యక్తి మనసు మారే అవకాశం లేదని చెప్పగలరా? కాబట్టి, మీ ఆలోచనల్ని పక్కన పెట్టి.. మీ అభిప్రాయాలకు విలువ ఇస్తాడా? మీ కెరీర్ను ప్రోత్సహిస్తాడా? మీకు అండగా ఉంటాడా? అనేది ఆలోచించండి. అన్ని విధాలా తగినవాడు అనిపిస్తే ఆమోదం తెలపండి.