ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బీసీసీఐ 2023వ సీజన్లో ప్రవేశపెట్టి తీవ్ర చర్చనీయాంశమవుతున్న ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనపై మెజారిటీ కెప్టెన్లు అభ్యంతరం వ్యక్తం చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ మేరకు 19వ ఎడిషన్‌కు ముందు బీసీసీఐ.. ముంబైలో నిర్వహించిన ‘కెప్టెన్సీ మీట్’లో ఎక్కువమంది సారథులు ఈ నిబంధనపై పెదవి విరిచినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై బుధవారం బీసీసీఐ నిర్వహించిన కెప్టెన్సీ మీట్ సమావేశంలో వారి అభిప్రాయాలు చెప్పిన కెప్టెన్లలో ఎక్కువమంది దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారి అభిప్రాయమెలా ఉన్నా బీసీసీఐ ఈ నిబంధనను 2027 దాకా పొడిగించిన నేపథ్యంలో దానిని 20వ సీజన్ తర్వాతే సమీక్షించనుంది’ అని ఐపీఎల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంపాక్ట్ ప్లేయర్‌తో పాటు ‘బాల్ ఛేంజ్’, ‘ట్రైనింగ్ గైడ్‌లైన్స్’పై చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్ మట్లాడుతూ.. ‘ఒక ఆల్‌రౌండర్‌గా ఈ రూల్‌కు నేను వ్యతిరేకం. కానీ నిబంధనలను పాటించాలి కావున పాటిస్తున్నాం’ అని కుండబద్దలు కొట్టి మరోసారి దీనిపై చర్చకు తెరలేపాడు. గతంలో రోహిత్ శర్మ స్పందిస్తూ.. ఈ నిబంధన వల్ల భారత క్రికెట్లో ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరి ఇంతమంది వ్యతిరేకిస్తున్న ఈ రూల్‌పై వచ్చే సీజన్లో అయినా బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరం.
బీసీసీఐ నిరుటి సీజన్లో తీసుకొచ్చిన బాల్ ఛేంజ్ రూల్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వర్తింపజేయాలని పలువురు కెప్టెన్లు కోరినట్టు తెలుస్తున్నది. రెండో ఇన్నింగ్స్ పదో ఓవర్ తర్వాత ఫీల్డింగ్ జట్లకు బంతిని మార్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు దానిని ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనూ వర్తింపజేయాలని కోరినా దీనికి పూర్తిస్థాయి మద్దతు లభించలేదని సమాచారం. అదీగాక బీసీసీఐ ఇటీవల విడుదల చేసిన ట్రైనింగ్ గైడ్లైన్స్పైనా నాయకులు మరింత స్పష్టత కోరినట్టు తెలుస్తున్నది.
పేరుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినా విదేశీ ఆటగాళ్లు, అంతర్జాతీయంగా గుర్తింపుపొందిన సారథులతో జట్లు నిండిపోయేవి. ఆరంభ సీజన్ (2008) నుంచి నిరుటి (2025) దాకా కెప్టెన్సీ మీట్లలో భారత ఆటగాళ్లతో పాటు విదేశీ జట్ల క్రికెటర్లూ ఆయా ఫ్రాంచైజీలకు కెప్టెన్లుగా ఈ కార్యక్రమానికి వచ్చేవారు. కానీ ఈ సీజన్లో మాత్రం పూర్తిగా పది జట్లకు పదిమంది భారత్‌కు చెందిన ఆటగాళ్లే కెప్టెన్సీ మీట్‌కు హాజరవడం విశేషం.