Jammu | కశ్మీర్ లోయలో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్నప్పడు జరిగిన చారిత్రక నేరాలకు సంబంధించిన కేసులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తిరిగి విచారణ చేసేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కశ్మీరీ పండిట్ల ఊచకోత కేసుపై కూడా దృష్టిపెట్టింది స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA). ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను పరిశీలించి అనుమానితులను విచారిస్తూ ఆధారాలను సేకరిస్తుంది ఎస్ఐఏ. అంతేకాదు ఇతర ప్రముఖ హత్య కేసులపై కూడా తిరిగి విచారణ చేపడుతుంది ఎస్ఐఏ. ఈ కేసుల విచారణ నిమిత్తం ఎస్ఐఏ బృందం ఇటీవల పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి సోదాలు చేపట్టింది.
23 మంది పండిట్ల ఊచకోత
1998, జనవరి 25న గందర్బల్ (Ganderbal) జిల్లాలోని వంధామా గ్రామంలో కశ్మీరీ పండిట్ కుటుంబాల ఇళ్లలోకి ఉగ్రవాదులు ఆయుధాలతో చొరబడ్డారు. తొమ్మిది మంది మహిళలు, నలుగు పిల్లలతో సహా మొత్తం 23 మందిని కాల్చి చంపారు. ఈ ఘటన రంజాన్ నెలలోని పవిత్ర రోజుల్లో ఒకటైన షబ్ ఎ ఖద్ర్ రాత్రి, గణతంత్ర దినోత్సవానికి ఒకరోజుముందు జరిగింది. ఈ కేసు సుమారు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉంది.
అదేవిధంగా ఉగ్రవాదులు 1989, సెప్టెంబర్‌లో అప్పటి జమ్మూ కశ్మీర్ బీజేపీ ఉపాధ్యక్షుడు అయిన కశ్మీరీ పండిట్ టీకా లాల్ టప్లూను కాల్చిచంపారు. జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) ఉగ్రవాది మక్బూల్ భట్‌కు మరణశిక్ష విధించిన జస్టిస్ నీలకంఠ గంజూను 1989, నవంబర్ 4న హత్య చేశారు. వీటితో పాటు1990లో జరిగిన నర్సు సరళా భట్, రచయిత సర్వానంద్ కౌల్ ప్రేమి, అతని కుమారుడు వీరేందర్ కౌల్ల హత్య కేసులపై కూడా ఎస్ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులకు సంబంధించి బతికి ఉన్న అనుమానితులు, ఉగ్రవాదులకు సహాయం చేసినవారిని గుర్తించడంలో సహాయపడే ఆధారాలను సేకరిస్తుంది.