హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మరిన్ని పెట్టుబడులతో సంస్థను విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్ (హెచ్‌సీసీబీ) కంపెనీని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు మంచి అవకాశాలున్నాయని, ఇతర బేవరేజెస్ కంపెనీలు కూడా ఇక్కడ ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తోడ్పాటును అందించాలని పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ శివారులోని అమీన్పూర్లో 1997లో ఇదే రోజున కోకా-కోలా కంపెనీని ఏర్పాటు చేశారు. సంస్థ ఏర్పాటై 25 ఏండ్లు (సిల్వర్‌జూబ్లీ) పూర్తయిన సందర్భంగా వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇందులో మాట్లాడుతూ.. పారిశ్రామిక అనుకూల విధానాలను అమలుచేస్తూ శీఘ్రగతిన అభివృద్ధి చెందుతున్న ప్రగతిశీల రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటన్నారు. ఇక్కడ కోకా-కోలా సంస్థ ఉండటం తమకెంతో గర్వకారణమన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల ప్రపంచంలోని ప్రఖ్యాత కార్పొరేట్ కంపెనీలకు తెలంగాణ నిలయంగా మారిందని, సుస్థిరాభివృద్ధి జరుగుతున్నదన్నారు. కార్పొరేట్ సంస్థలు రాష్ర్టానికి అంబాసిడర్లుగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. కాగా, 25 ఏండ్ల మైలురాయిని పురస్కరించుకొని 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు మంత్రి ఈ సందర్భంగా కోకా-కోలా సంస్థను అభినందించారు. రోజురోజుకూ కాలుష్య సమస్య ఎక్కువవుతున్న ప్రస్తుత తరుణంలో చల్లని వాతావరణం, పచ్చని పర్యావరణ వ్యవస్థ ఎంతో అవసరమన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఇంతకుమించి మంచి సందర్భం ఉండదని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా 25వ వార్షికోత్సవం సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీతో కలిసి ఘనవ్యర్థాల నిర్వహణ వ్యవస్థను నెలకొల్పేందుకు కోకా-కోలా ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు.
పెట్టుబడులు పెడతాం: నీరజ్ గార్గ్
హెచ్‌సీసీబీ చైర్మన్, సీఈవో నీరజ్ గార్గ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు అందుతున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్ కోరిన విధంగా అదనపు పెట్టుబడులు పెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. తమ సంస్థ అభివృద్ధిలో భాగస్వాములైన పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.