ఆమె పాట ..‘గుట్ట గుట్టా ఎక్కుతూ గుట్టెక్కీ గురి’ కొడుతున్నది. ‘యవ్వన్న వోయిలాల గొబ్బియ్యాలో’ అంటూ గోడెక్కి కూస్తున్నది. ‘తెల్లతెల్లా తెప్పలకెల్లి నాగుమల్లె దారిలో’ అని నాట్యం చేయిస్తున్నది. తెలంగాణ సంస్కృతిని గుర్తుచేసే పల్లెదనపు మూట రేలారే శ్యామల పాటల ముచ్చట..
జానపదం, నేను అముడాల పిల్లలం. ఎందుకంటే మా అమ్మానాయిన మంచి పాటగాళ్లు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వేముల మట్టి వాసనను పీల్చుకుంటూ నేను జానపదం నేర్చుకున్న. పాటతో పాటు పెద్దగైన. పెండ్లయింది. అత్తగారి ఊరైన.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం సంగెంకు నాతో పాటు పాట కూడా వచ్చింది. మా ఇంట్లో అక్క, అన్న పాడుతుంటే చూసి నేనూ పాడటం నేర్చుకున్న.
చదువుపై తొలిపాట
అప్పుడు నేను ఐదో తరగతి. టీచర్లు పాట పాడమన్నరు. ‘సదువుకోను పోతానయ్యా సదువుకోను పోతాను.. సదువుకోను పోవద్దంటే పారిపోయి సదువుతాను.. బడికి నన్నుపంపాలె అయ్యో నా అయ్యా!’ అనే సామాజిక గీతం పాడిన. నాతో పాటు విద్యార్థులు, టీచర్ల కండ్ల నుంచి నీళ్లు వొలవొలా కారినయి. పాటకు ‘ఇంత ప్రభావం ఉంటదా?’ అనిపించింది. ఆ పాట తర్వాత బడిలో నా స్థాయి మారిపోయింది. అందరూ విలువిచ్చి మాట్లాడుతుండె. ఈ పాటను నేను మా అన్న దగ్గర నేర్చుకున్న. ‘శ్యామలా! ఎక్కడ నేర్చుకున్నవోగానీ మంచి పాటలు పాడుతవ్. నీకు భవిష్యత్ ఉంది’ అని రత్నశేఖర్ సార్ అన్నడు. నేను చదువులో కూడా చురుకే అయినా, ఎందుకో బడిలో పాటతోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది.
పొలంలో నేర్చుకున్న
పొద్దంతా పనిజేసి అలసిపోయిన మా అమ్మ ఇంటికొచ్చినంక ముత్యాల్లాంటి పాటలు పాడి వినిపిస్తుండె. వాటికి అర్థం తెలియకపోయినా నా నోటికి అబ్బేవి. ఖాళీ దొరికినప్పుడు అమ్మతోటి పొలం పనులకు పోయేదాన్ని. పొలాల్లో అమ్మలక్కలు పాడే పాటల్ని వింటుంటి. ఇంటికొచ్చినంక నాకు నేనే పాడుకుంటా ప్రాక్టీస్ చేస్తుంటి. అట్లా మెల్లమెల్లగా పల్లెపదాలతో సోపతి కుదిరింది. పొలంలో పనిచేసుకుంటూ, నేను నేర్చుకొని స్టేజిమీద పాడిన ఫస్టు పాట ‘ఓ మామ నాగులయ్యా.. సినమామ నాగులయ్యా నేను సిన్నదాన్ని మామో ఓ మామ నాగులయ్య’. ఇది నాకు మంచి పేరు తీసుకొచ్చింది.
ఒక్కపాటతోనే ఫేమస్
అది 2012. ‘మా టీవీ’లో రేలారే రేలా నాలుగో దరువుకు ఆడిషన్స్ జరుగుతున్నయి. మా అన్న రెండో దరువులో పాల్గొన్నడు. అట్లనే నాలుగో దరువుకు నాతో అప్లయ్ చేపించిండు. అనుకున్నట్లుగానే ఎంపికైన. మొదటిరోజు ‘పొద్దు పొద్దుల్లు రెండు పొద్దుల్లే రెండూ.. యవ్వన్న వోయిలాల గొబ్బియ్యాలో’ పాట పాడిన. మంచి గుర్తింపు తీసుకొచ్చిందీ పాట. ఈ పోటీల్లో మొత్తం పన్నెండు పాటలు పాడిన. అన్నీ బాగొచ్చినయి. రావడమే కాదు, నన్ను ఫైనల్స్ వరకు తీసుకెళ్లినయి. ఫైనల్ ఈవెంట్లో ‘నల్లనగర సిన్ని కొమర.. ఘల్లుఘల్లున రావయ్యో’ పాట పాడిన. తర్వాత మైక్ టీవీ ‘ఫోక్ స్టూడియో’కు ఎంపికైన. హెచ్ఎం టీవీలో ‘జజ్జనకరి జనారే’ కాంపిటీషన్స్‌కు వెళ్లిన. అక్కడ ‘ఒడ్డుమీద రేడీగవెట్టి గడ్డిగోసె గందాపురెడ్డీ.. ఓ మామయ్యా మోపెత్తీ పోవయా’ పాట నాకు మంచి పేరు తీసుకొచ్చింది. యూట్యూబ్‌కు వచ్చినంక బాగా ఫేమస్ అయిన. ‘గుట్ట గుట్టా తిరిగేటోడా బీమచారి గుట్టెక్కీ గురిగొట్టేటోడా’ నన్ను ఎక్కడికో తీస్కపోయింది. మొదటి పాటే అయినా ఓ వంద పాటలు పాడినంత గుర్తింపు తీసుకొచ్చింది.
లక్ష్మణ్ వల్ల అవకాశం
‘బుల్లెట్ బండి’ లక్ష్మణ్ వాళ్లు మాకు చుట్టాలైతరు. ఒకసారి నేను ‘గుట్టగుట్టా తిరిగేటోడా బీమచారి’ పాట వినిపించిన. డిస్కో రికార్డింగ్ కంపెనీ వాళ్లకు పరిచయం చేసిండ్రు లక్ష్మణ్. డెమో వినిపిస్తే బాగుందన్నరు. వెంటనే పాటను షూట్ చేసి విడుదల చేసిండ్రు. నేను అనుకున్నదానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. ఇప్పటికీ ఏ ఈవెంట్ జరిగినా ఈ పాటే హల్చల్ చేస్తది. ఇదే పాటను డీజే వెర్షన్లో తీసుకొస్తే.. మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టింది. దీని తర్వాత వరుసగా ఆరు పాటలు డిస్కో రికార్డింగ్ వాళ్లతోనే చేసిన. ‘తెల్ల తెల్ల తెప్పలకెల్లి నాగుమల్లె దారిలో’ నా రెండో పాట. ఇదీ జనాల్లోకి వెళ్లింది. ఈ మధ్యకాలంలో ‘వేముల మ్యూజిక్’ చానల్లో ‘దొండా పండెర్రానా.. తొడిమె నల్లాది.. ఓగంగదారీ’ పాట పాడిన. ‘గుట్ట గుట్ట తిరిగేటోడా’ తర్వాత నాకు అంతగా పేరు తీసుకొచ్చిందీ పాట. ఇప్పుడు ఎక్కడికెళ్లినా నన్ను గుర్తు పడ్తుండ్రు. నాతో సెల్ఫీలు దిగుతుండ్రు. సక్సెస్ అంటే ఇదేనేమో!
నేను పాడిన వాటిలో చాలామటుకు నేను రాసుకున్నవే. ఇప్పటివరకు యూట్యూబ్ వేదికగా 20కి పైగా జాన పదాలు పాడిన. డిగ్రీ వరకు చదివిన. నర్సింగ్ కోర్సు కూడా చేసిన. పాటల వెంటపడి కెరీర్ పాడుచేసుకుంటున్ననా అనిపించేది తొలినాళ్లలో. కానీ ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అందుకే పాటపైనే ధ్యాస పెడుతున్న. ముందు తరాలు పాడిన పల్లె పదాలను సేకరించే పనిలో ఉన్న. మా ఆయన పేరు రవికుమార్. పెండ్లయిన తర్వాత కూడా పాడుతున్నానంటే అది మా ఆయన ప్రోత్సాహంతోనే. కుటుంబ బలంతోనే. ‘పాటనే కెరీర్‌గా ఎంచుకుంటున్నా’ అని చెప్పినప్పుడు ‘నీ ఇష్టం’ అని నా నిర్ణయానికే వదిలేసిండ్రు. నా ప్రాణమంతా పాటలోనే ఉంది. మంచి పాటలు రాసి, మంచిగ పాడటమే లక్ష్యంగా పెట్టుకొన్న.
… దాయి శ్రీశైలం