హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఒప్పందాలు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్తు విచారణ సంఘం తన కార్యకలాపాలను ఆపేసింది. విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్న ఫైళ్లను ఆయా ఆఫీసులకు పంపిస్తున్నారు. జస్టిస్ మదన్ బీ లోకూర్ విచారణ సంఘం అక్టోబర్ 28న నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మొత్తం 100 పేజీల్లో రిపోర్టును రూపొందించి ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ సందీప్‌కుమార్ సుల్తానియాకు అందజేసింది. ఈ కమిషన్ గడువు అక్టోబర్ 29తో ముగిసింది. దీంతో బీఆర్కేభవన్‌లోని విచారణ సంఘం కార్యాలయాన్ని ఖాళీచేస్తున్నారు. ఉద్యోగులు, సిబ్బందిని వారి సొంత స్థానాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే కొన్ని పైళ్లను ఆయా శాఖలకు పంపించగా, ఒకట్రెండు రోజుల్లో మిగతా ఫైళ్లను సైతం పంపించనున్నట్టు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
‘ఎంఈవోల నియామకం రాజ్యాంగ విరుద్ధం’
హైదరాబాద్, నవంబర్ 4 (నమ స్తే తెలంగాణ): జిల్లా పరిషత్ స్కూళ్లల్లోని హెచ్ఎంలకు మండల విద్యాధికారులుగా(ఎంఈవో) అదనపు బాధ్యతలు అప్పగించడం రాజ్యాం గ విరుద్ధమని, వారిని వెంటనే తప్పించాలని లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్(జీటీఏ)ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిం ది. జోనల్ పోస్టు పదోన్నతులకు అర్హత గల ప్రభుత్వ పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించాలని కోరింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడోజు వీరాచారి, ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మీకాంత్‌రెడ్డి సోమవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఆర్టికల్-309, రూల్స్-49 కు విరుద్ధమని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టంచేశారు.