న్యూఢిల్లీ, జూలై 14 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏడాదిప్రాతిపదికన 16.40 శాతం ఎగబాకి రూ.6.51 లక్షల కోట్లు వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. కార్పొరేట్ ట్యాక్స్ అధికంగా వసూలవడం వల్లనే పన్ను వసూళ్లలో రెండంకెల వృద్ధి నమోదైందని పేర్కొంది.
ఈ నెల 13 నాటికి కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 22 శాతం వృద్ధితో రూ.2.40 లక్షల కోట్లకు చేరుకోగా, కార్పొరేటేతర పన్ను వసూళ్లు కూడా 12 శాతం పెరిగి రూ.3.84 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వసూళ్లు 48 శాతం అధికమై రూ.26,429 కోట్లకు చేరుకోగా, రూ.1.22 లక్షల కోట్లు రిఫండ్స్ రూపంలో చెల్లింపులు జరిపింది. స్థూలంగా ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.73 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.