బ్యాంకాక్ : భారత యువ షట్లర్ దేవిక షగ్ థాయ్‌లాండ్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంట్లో సెమీస్‌కు ప్రవేశించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ దేవిక.. 21-19, 21-18తో లోకల్ ఫేవరేట్, ప్రపంచ 16వ ర్యాంకర్ సుపనిద కేట్థాంగ్కు షాకిచ్చింది. 40 నిమిషాల్లో ముగిసిన పోరులో 20 ఏండ్ల భారత అమ్మాయి.. పూర్తి నియంత్రణతో కూడిన ఆటతో లాస్ట్-4కు చేరింది.
మరో క్వార్టర్స్‌లో ఇషారాణి.. 21-18, 16-21, 13-21తో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్ చేతిలో ఓడిపోయింది. ఇక పురుషుల విభాగంలో భారత పతక ఆశలు మోసిన తరుణ్ మన్నెపల్లి.. 11-21, 17-21తో ఝు జువాన్ చెన్ (చైనా)కు తలవంచాడు.