నగోయా : ఆసియాడ్‌లో భారత అథ్లెట్లు పతక పరుగు కొనసాగుతోంది. సోమవారం పోటీల్లో మూడు రజతాలు, మూడు కాంస్యాలతో ఒక్క రోజే ఆరు మెడల్స్‌తో సిక్సర్ కొట్టడంతో అథ్లెటిక్స్‌లో భారత పతకాల సంఖ్య 19కి చేరింది. పురుషుల లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్, 1500 మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్, జావెలిన్ త్రోలో యశ్వీర్ సింగ్ రజతాలు నెగ్గగా.. 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్య రామ్రాజ్, జావెలిన్ త్రోలో రోహిత్ యాదవ్, 5000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి కాంస్య పతకాలు గెలిచారు. లాంగ్ జంప్‌లో శ్రీశంకర్ నాలుగో జంప్ సమయంలో మడమ గాయానికి గురవడంతో ఆఖరి రెండు ప్రయత్నాలు చేయలేకపోయాడు. అయితే, రెండో జంప్‌లో 8.07 మీటర్ల దూరం అతనికి సిల్వర్‌ను ఖాయం చేసింది. షి యుహావో (చైనా-8.17 మీ) స్వర్ణం సాధించాడు. ఇక 1500 మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్ 3 నిమిషాల 36.72 సెకన్ల వ్యక్తిగత ఉత్తమ టైమింగ్‌తో వెండి కైవసం చేసుకున్నాడు. ఇప్పటికే 10 వేల మీటర్ల పరుగులో రజతం నెగ్గిన గుల్వీర్కు ఈ ఆసియాడ్‌లో ఇది రెండో పతకం. మహిళల కురాశ్లో భాగంగా 78 కిలోల సెమీస్‌లో ఓడిన పింకీ బల్హారా కాంస్యంతో సరిపెట్టుకుంది.
గాయంతో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా వైదొలగడంతో ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన యశ్వీర్ సింగ్ సంచలనం సృష్టించాడు. పురుషుల జావెలిన్ త్రోలో యశ్వీర్ తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన 85.72 మీటర్లు విసిరి రజతం సాధించగా, మరో భారత అథ్లెట్ రోహిత్ యాదవ్ 84.35 మీటర్లతో కాంస్యం గెలుచుకున్నాడు. శ్రీలంక ఆటగాడు పతిరాగే (88.55 మీ) స్వర్ణం నెగ్గాడు. మరోవైపు మహిళల 5వేల మీటర్ల పరుగులో పారుల్ చౌదరి (15:14.61 సెకన్లు) కాంస్యం సాధించింది.

మహిళల 400 మీటర్ల హర్డిల్స్లోతమిళనాడుకు చెందిన 28 ఏండ్ల విత్య 54.75 సెకన్లలో రేసును పూర్తి చేసి కాంస్యం గెలిచింది.ఈ క్రమంలో భారత అథ్లెటిక్స్ దిగ్గజం పీటీ ఉష పేరు మీద 42 ఏండ్లుగా ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. 1984 ఒలింపిక్స్‌లో ఉష నమోదు చేసిన 55.42 సెకన్ల రికార్డును తిరగరాసింది. ఐఓఏ అధ్యక్షురాలిగా పీటీ ఉష స్టేడియంలో స్వయంగా వీక్షిస్తుండగానే విత్య ఈ ఘనత సాధించడం విశేషం.
ఆర్చరీ కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో స్కోర్లు 148-148తో సమమవగా షూటాఫ్ ద్వారా తేలిన ఫలితంతో చికిత ఇన్నర్ సర్కిల్లో పదికి పది పాయింట్లు కొట్టి చెన్ యి-సువాన్ (చైనీస్ తైపీ)ని ఓడించింది. కానీ, గత ఎడిషన్‌లో స్వర్ణం సాధించిన ఆంధ్రా షూటర్ జ్యోతి సురేఖ ప్రిక్వార్టర్స్‌లోనే ఓడింది. ఇక, స్కాష్ టీమ్ ఈవెంట్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు క్వార్టర్స్ చేరాయి. హాకీలో భారత పురుషుల జట్టు.. పూల్-ఏలో ఆడిన ఆఖరి మ్యాచ్‌లో 10-0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. బాక్సింగ్‌లో మరో ముగ్గురు బాక్సర్లు సెమీస్‌కు చేరుకుని పతకాలు ఖాయం చేసుకున్నారు. మహిళల 75 కిలోల క్వార్టర్స్ బౌట్లో లవ్లీనా బొర్గొహెయిన్ 5-0తో సుయోన్ (కొరియా)పై గెలిచింది. ఆమెతో పాటు 60 కేజీల కేటగిరీలో ప్రియా ఘంఘాస్, పురుషుల 90 కిలోల విభాగంలో కపిల్ సెమీస్ చేరారు.