Mexico Tariffs : దిగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచేందుకు మెక్సికో (Mexico) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మెక్సికో టారిఫ్‌ల పెంపుపై భారత్ స్పందించింది. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూరే విధంగా చర్చలు జరుపుతామని భారత్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో తమ ఎగుమతిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకునే హక్కు ఉందని భారత అధికారి వ్యాఖ్యానించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇండియా, చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ఇండోనేసియాతోపాటు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలేని ఇతర ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను పెంచే విషయంలో మెక్సికో గత సెప్టెంబర్‌లోనే సెనెట్‌లో ప్రతిపాదనలు పెట్టింది. అప్పటి నుంచే ఆ దేశంతో భారత్ చర్చలు జరుపుతున్నదని అధికారులు చెబుతున్నారు. అక్కడి భారత రాయబార కార్యాలయం సెప్టెంబర్ 30న ఆర్థిక మంత్రిత్వశాఖ వద్ద ఈ విషయాన్ని లేవనెత్తిందని అన్నారు.
కొత్తగా ప్రతిపాదించిన సుంకాల నుంచి భారత ఎగుమతులకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని కోరినట్లు తెలిపారు. మెక్సికోతో భాగస్వామ్యానికి భారత్ ఎంతో విలువ ఇస్తుందని, ఇరుదేశాల్లోని వ్యాపారులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా స్థిరమైన వాణిజ్యం కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి చర్చలు ప్రారంభించేందుకు చూస్తున్నట్లు తెలిపారు.
ఇదిలావుంటే భారత వాణిజ్య విభాగ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్, మెక్సికో ఆర్థిక ఉపమంత్రి లూయిస్ రోసెండో మధ్య మెక్సికో సుంకాలకు సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై మరిన్ని సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. దేశీయ ఉత్పత్తులను పెంచడంలో భాగంగా చైనా, భారత్ సహా పలు ఆసియా దేశాలకు చెందిన 1400 వస్తువులపై సుంకాలను 50 శాతం పెంచాలని మెక్సికో నిర్ణయించింది. ఈ పెంపు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.