Indian Navy : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో భారత జెండా (Indian flag) తో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ బలగాలు ఇటీవల కాల్పులు జరిపాయి. ఈ నేపథ్యంలో భారత జెండా కలిగిన నౌకలకు మన నౌకాదళం అడ్వయిజరీ జారీ చేసిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. లారక్ ఐలాండ్‌కు దూరంగా ఉండాలని, తమ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే హర్మూజ్‌లో ప్రయాణించాలని నేవీ పేర్కొన్నది. ఆ జలసంధిని దాటేందుకు వేచి ఉన్న నౌకల భద్రతను నిర్ధారించేందుకే ఈ సూచనలని తెలిపింది. లారక్ ద్వీపం హర్మూజ్‌కు సమీపంలో ఉంటుందని చెప్పింది.
యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి 11 నౌకలు ఈ జలమార్గాన్ని దాటాయి. ఈ జలసంధిని దాటిన చివరి ట్యాంకర్ దేశ్ గరిమ. అదేరోజు జగ్ అర్ణవ్, సన్మార్ హెరాల్డ్ ఈ మార్గంలో ప్రయాణిస్తుండగా.. ఇరాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనను విదేశాంగశాఖ ఖండించిన సంగతి తెలిసిందే. భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని పిలిపించి ఈ ఘటనపై నిరసనను తెలియజేసింది. గతంలో తమ దేశానికి బయల్దేరిన అనేక నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ సహకరించిందని ఈ సందర్భంగా గుర్తుచేసింది.