హలన్బుయిర్ (చైనా): ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ జోరు కొనసాగిస్తోంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ‘మెన్ ఇన్ బ్లూ’ ఈ టోర్నీలో సెమీస్‌కు అర్హత సాధించింది. బుధవారం హలన్బుయిర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్.. 8-1తో మలేషియాను చిత్తుచిత్తుగా ఓడించింది. చైనా, జపాన్‌పై రెచ్చిపోయిన యువ స్ట్రైకర్లు మలేషియాతో మ్యాచ్‌లో గోల్స్ పండుగ చేసుకున్నారు. రాజ్‌కుమార్ హ్యాట్రిక్ గోల్స్ (3, 25, 33 నిమిషాల్లో) చేయగా అరేజీత్ సింగ్ హుండాల్ (6, 39) రెండు గోల్స్ కొట్టాడు. జుగ్రాజ్ సింగ్ (7), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (22), ఉత్తమ్ సింగ్ (40) తలా ఓ గోల్ చేసి భారత్‌కు భారీ విజయాన్ని అందించారు. మలేషియా నుంచి అఖిముల్లా అనుర్ ఒక్కడే 34వ నిమిషంలో గోల్ చేయగలిగాడు. ఆట ఆరంభం నుంచీ ముగింపు దాకా ప్రత్యర్థిపై గోల్స్‌తో విరుచుపడ్డ భారత్.. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు సెమీస్ బెర్తునూ ఖాయం చేసుకుంది. లీగ్ దశలో భాగంగా భారత్ తమ తదుపరి మ్యాచ్‌లను దక్షిణకొరియా, పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంది.