బ్యూనస్ ఎయిర్స్(అర్జెంటీనా): ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో మరో రజతం చేరింది. బుధవారం జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత జోడీ ఆర్య-రుద్రాంక్ష్.. 9 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచారు. చైనా ద్వయం వాంగ్ జిఫీ-సంగ్ బుహాన్ 17 పాయింట్లతో స్వర్ణం దక్కించుకుంది. మంగళవారం రాత్రి ముగిసిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత యువ షూటర్ విజయ్‌వీర్ సిద్ధు స్వర్ణం గెలుచుకున్నాడు. భారత్ ఏడు పతకాలతో రెండో స్థానంలో ఉంది.
బీఎఫ్ఐ వ్యవహారాలకు మధ్యంతర కమిటీ
ఢిల్లీ: బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) వ్యవహారాలను చూసుకునేందుకు గాను వరల్డ్ బాక్సింగ్ మధ్యంతర కమిటీని ఏర్పాటు చేసింది. బీఎఫ్ఐ ఎన్నికల నేపథ్యంలో దేశంలో బాక్సర్ల శిక్షణ, టోర్నీలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో బీఎఫ్ఐ చైర్మన్ అజయ్ సింగ్ అభ్యర్థన మేరకు వరల్డ్ బాక్సింగ్ అధ్యక్షుడు బోరిస్ వాన్‌డర్.. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.