బ్లూమ్‌ఫాంటైన్: టాపార్డర్ విజృంభించడంతో భారత-‘ఎ’ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార టెస్టులో దక్షిణాఫ్రికా-‘ఎ’ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా-‘ఎ’ జట్టు.. మంగళవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. పీటర్ మలన్ (157 బ్యాటింగ్; 18 ఫోర్లు), టోనీ జార్జీ (117; 18 ఫోర్లు) సెంచరీలతో చెలరేగగా.. జాసన్ స్మిత్ (51 బ్యాటింగ్) రాణించాడు. రోజంతా బౌలింగ్ చేసిన మనవాళ్లు కేవలం మూడు వికెట్లే పడగొట్టారు. నవ్‌దీప్ సైనీ, అర్జాన్ నాగ్వస్వల్లా, ఉమ్రాన్ మాలిక్ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. వచ్చే నెలలో టీమ్ఇండియా దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న నేపథ్యంలో.. మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్-ఎ జట్టు సఫారీ టూర్‌కు వెళ్లింది. యువ ఓపెనర్ పృథ్వీ షా, హనుమ విహారి, సైనీ వంటి వారికి ఈ పర్యటన ఎంతగానో తోడ్పడనున్నది.