Millennials | ముంబై, ఫిబ్రవరి 20 : ఇల్లు కొనడం.. వ్యాపారాన్ని మొదలుపెట్టడం.. ఆర్థిక స్వాతంత్య్రం.. ఈ మూడే ఇప్పుడు దేశంలోని అత్యధిక మిల్లేనియల్స్ దీర్ఘకాల లక్ష్యాలు. ‘ఫైబ్-మిల్లేనియల్ అప్గ్రేడ్ ఇండెక్స్’ ఆధారంగా జరిగిన ఓ అధ్యయనంలో సొంతింటి కలను నెరవేర్చుకోవడమే తమ లక్ష్యమని 41 శాతానికిపైగా మిల్లేనియల్స్ స్పష్టం చేశారు. వీరిలో ఎక్కువమంది వయసు 30 శాతంలోపేనని తేలింది. ఇక పురుషులతో పోల్చితే ఒంటరి మహిళల్లో ఇల్లు కొనాలనే ఆశ బలంగా ఉండటం గమనార్హం. కాగా, దాదాపు 21 శాతం మంది తమ వ్యాపారాభివృద్ధికే శ్రమిస్తున్నట్టు చెప్పారు. 19 శాతం మంది ఎవరి సాయం లేకుండా తాము ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆకాంక్షను కనబర్చారు. దేశవ్యాప్తంగా మెట్రో, నాన్-మెట్రో నగరాల్లోని 8వేల మంది అభిప్రాయాలతో ఈ అధ్యయనం జరిగింది. వీరిలో 47 శాతం మంది 30 ఏండ్లలోపు వయసున్నవారే. 30-35 ఏండ్లవారు 26 శాతం, 35-40 ఏండ్లవారు 14 శాతం, 40 ఏండ్లకుపైగా వయసున్నవారు 13 శాతం ఉన్నారు. 1981 నుంచి 1996 మధ్య జన్మించినవారి (29-44 ఏండ్ల వయస్కులు)ని మిల్లేనియల్స్గా పిలుస్తారన్న విషయం తెలిసిందే.
మిల్లేనియల్స్ స్వల్పకాలిక లక్ష్యాల్లో వృత్తిపరమైన వృద్ధి, కొత్త గ్యాడ్జెట్ లేదా వాహనం కొనుగోలు వంటివి ముందున్నాయి. మరికొందరు దంత చికిత్స, కంటి ఆపరేషన్లు చేయించుకోవాలని కూడా చెప్పడం విశేషం. ఇదిలావుంటే మెట్రో నగరాల్లో ఉన్న మిల్లేనియల్స్లో మెరుగైన ఉద్యోగాన్ని సంపాదించడం కష్టంగా ఉందన్న అభిప్రాయం ఉన్నట్టు సర్వే తెలిపింది. జాబ్ మార్కెట్లో విపరీతంగా పెరిగిన పోటీయే ఇందుకు కారణమన్నది. ఈ క్రమంలోనే 60 శాతం మందికి మెరుగైన ఉద్యోగమే లక్ష్యంగా ఉన్నట్టు పేర్కొన్నది. మొత్తానికి మిల్లేనియల్స్ ఆశలు, ఆకాంక్షలు, అభిప్రాయాల కలబోతగా ఈ అధ్యయనం నిలుస్తున్నది. వారి లక్ష్యాల సాధనకు ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలన్నదానిపై ఓ స్పష్టతనే కలిగి ఉన్నారని చెప్పవచ్చు. అయితే అందుకు తగ్గట్టు కంపెనీల యాజమాన్యాలు, ప్రభుత్వాలు, కుటుంబాలు సహకారం అందిస్తే వేగంగా ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని సర్వే అభిప్రాయపడింది.
మా అధ్యయనం మిల్లేనియల్స్లో ఉన్న బలమైన ఆకాంక్షలకు అద్దం పట్టింది. వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థికపరమైన కోర్కెలను తెలియజేసింది. నిజానికి చాలామంది వారి స్వల్పకాలిక ఆశలను, తక్షణ అవసరాలను, సౌకర్యాలను తీర్చుకోవడానికి బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థల నుంచి రుణాల కోసం ప్రయత్నిస్తున్నారు.