న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, వడోదర నివాసి జాకబ్ మార్టిన్(Jacob Martin).. 22 ఏళ్ల క్రితం నాటి కేసులో నిర్దోషిగా తేలాడు. 2004లో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఐపీసీలోని 420, 468, 471, 120బీతో పాటు పాస్‌పోర్ట్ చట్టంలోని 12 సెక్షన్ కింద అతనిపై కేసు బుక్ చేశారు. యూకే ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఫోర్జరీ చేసినట్లు మార్టిన్ జాకబ్‌పై ఆరోపణలు ఉన్నాయి. అతనిపై నమోదు అయిన ట్రావెల్, ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్స్ కేసుల్లోనూ ఎటువంటి ఆధారాలను కోర్టు ముందు చూపలేకపోయారు. అజ్వా స్పోర్ట్స్ క్లబ్ జాకబ్ మార్టిన్ ఆధీనంలో ఉన్నట్లు ఆధారాలు లేవని కోర్టు పేర్కొన్నది. సాక్ష్యులు కూడా ఎటువంటి ఆధారాన్ని చూపలేకపోయినట్లు చెప్పారు. తప్పుడు కేసు వల్ల తాను మానసిక క్షోభకు గురైనట్లు మార్టిన్ తెలిపాడు. ఆ కేసు వల్ల తన రైల్వే జాబ్ కూడా పోయిందన్నారు. నిర్దోషిగా తేలడంతో చాలా రిలీఫ్ వచ్చినట్లు చెప్పారు. ఇది తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుందన్నాడు.
2004లో తనకు చెందిన ఓ టీమ్ యూకేకు వెళ్లిందని, ఇంగ్లండ్‌లో ఆడిన తర్వాత ఆ టీమ్ వెనక్కి వచ్చిందని, కానీ ఓ కుర్రాడు అక్కడే ఉండిపోయాడని, ఆర్నెళ్ల వీసా కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా అతను అక్కడే ఉన్నాడని, అక్కడ ఫేక్ స్టాంప్పింగ్ వేయించుకున్నాడని, కానీ ఇండియాకు వచ్చే సమయంలో అతన్ని డిపోర్ట్ చేశారని, ఈ కేసులో తనను ప్రశ్నించారని మార్టిన్ తెలిపాడు. ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని, కానీ అప్పుడు తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడుతుండడం వల్ల తన పేరు పెద్దగా వినిపించిందన్నారు. రైట్ హ్యాండ్ బ్యాటర్ జాకబ్ మార్టిన్.. ఇండియా తరపున 10 వన్డేలు ఆడాడు. 22.57 యావరేజ్‌తో 158 రన్స్ స్కోరు చేశాడు.