బాల్యంనుంచే సంజయ్‌లీలా భన్సాలీ సినిమాలో కథానాయికగా నటించాలనే కోరిక ఉండేది. స్కూల్ రోజుల్లో నాన్నతో కలిసి ఓసారి ఆయనను కలిశాను. ‘నువ్వు తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతావు’అని ఆశీర్వదించారాయన. ‘గంగూబాయి కతియావాడి’సినిమా కోసం సంజయ్‌లీలా భన్సాలీతో కలిసి చేసిన సృజనాత్మక ప్రయాణం చిరకాలం గుర్తుండి పోతుంది.
అలియా అంటే అరబిక్‌లో ‘సర్వోన్నతమైన శకి’్త అనిఅర్థం. భవిష్యత్తును ఊహించే తల్లిదండ్రులు ఆమెకు ఆ పేరు పెట్టారేమో! అగ్రతార అలియా భట్ ఏదో ఒక చట్రంలో ఇమిడి పోకుండా విలక్షణ నటిగా సత్తా చాటుతున్నది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా ఈ భామ తెలుగులో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా నటించిన ‘గంగూబాయి కతియావాడి’ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా అలియా భట్ పాత్రికేయులతో పంచుకున్న
సినిమా ముచ్చట్లు…
ఈ బయోపిక్ చేయడానికి ప్రేరణనిచ్చిన అంశాలేమిటి?
దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ కథ చెప్పినప్పుడు సందిగ్ధంలో పడిపోయా. ఇంతటి భావావేశాలు కలిగిన బరువైన పాత్రకు నేను న్యాయం చేయగలనా? అనే సందేహం వచ్చింది. అదే మాట భన్సాలీని అడిగా. ఆయన తనదైన లాజిక్‌తో నన్ను ఒప్పించారు. ‘గంగూబాయి పాత్ర తెరపై ఎలా వస్తుందన్న భయం పెట్టుకోవద్దు. నా సూచనలు పాటిస్తే చాలు. జీవితకాలం గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’ అంటూ నాలో ధైర్యం నింపారు. నా గొంతు కాస్త పీలగా ఉంటుంది. గంగూబాయి వంటి గంభీరమైన పాత్రకు వాయిస్‌లో బేస్ అవసరమని చెప్పారు. గంగూబాయి గుజరాత్‌లోని కతియవాడ ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి, నా గొంతులో ఆ యాస పలికేలా జాగ్రత్తలు తీసుకున్నా.
మీరు కాస్త సన్నగా ఉంటారు. గంగూబాయి వంటి పవర్ఫుల్ పాత్ర కోసం ఎలాంటి ఫిజికల్ మేకోవర్ చేసుకున్నారు?
అన్నిటికంటే ముఖ్యంగా బరువు పెరగడమే పెద్ద సమస్యగా మారింది. నేను చాలా మితంగా తింటాను. ఈ సినిమా కోసమని ఆహార నియంత్రణ పక్కనపెట్టా. నచ్చిన ఫుడ్ లాగించాను. దాదాపు పది కిలోల బరువు పెరిగాను. దాంతో గంగూబాయి పాత్రకు పరిపూర్ణత చేకూరినట్లు అయ్యింది.
గంగూబాయి పాత్ర పోషణలో మీకు సవాలుగా అనిపించిన అంశాలేమిటి?
ముంబయి కామాటిపురలో ఓ వేశ్యగా జీవితాన్ని ప్రారంభించి, శక్తిమంతురాలైన రాజకీయ నాయకురాలిగా ఎదిగిన గంగూబాయి అనే మహిళ జీవిత కథ ఇది. నేను ముంబయిలో పుట్టిపెరిగినా ఇప్పటివరకు కామాటిపుర ప్రాంతం వైపు ఎప్పుడూ వెళ్లలేదు. తొలిసారి షూటింగ్ కోసం కామాటిపుర సెట్లోకి అడుగుపెట్టినప్పుడు అదొక కొత్త ప్రపంచంలా అనిపించింది. షూటింగ్ పూర్తిచేసుకొని ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ పాత్ర తాలూకు హ్యాంగోవర్ ఉండేది. ఇంట్లో కూడా గంగూబాయిలా మాట్లాడేదాన్ని. గత మూడేండ్ల నుంచీ గంగూబాయి మూడ్‌లోనే ఉంటున్నా..
కెరీర్ ఆరంభం నుంచి పాన్ఇండియా నటిగా పేరు తెచ్చుకోవాలని ఉండేది. శ్రీదేవి నా అభిమాన తార. తెలుగు, తమిళంతోపాటు హిందీలో కొన్నేండ్లపాటు ఆమె అగ్రతారగా వెలుగొందింది. నటనలో నేను శ్రీదేవిని స్ఫూర్తిగా తీసుకుంటా.
నా సినిమాల ద్వారా సమస్త భారతీయుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలని అనుకుంటున్నా. భాషాభేదాల గురించి నేనెప్పుడూ పట్టించుకోలేదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ద్వారా
దక్షిణాది ప్రేక్షకులు నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నా.
ఓ మహిళగా గంగూబాయి వ్యక్తిత్వంలో మీకు నచ్చిన అంశాలు ఏమిటి?
గంగూబాయి నేపథ్యం గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. నేను ఆమెను ఓ పోరాట యోధురాలిగా గౌరవిస్తాను. తాను ఎదిగి వచ్చిన పరిస్థితుల వల్ల ఆమెలో ఎప్పుడూ ఓ ఆక్రోశం కనిపించేది. వ్యవస్థపై నిరసన గళం వినిపించేది. తనలోని నిస్సహాయతను ఓ బలమైన శక్తిగా మార్చుకొని పోరాడిందామె. ఆ ధైర్యం, తెగింపు నాకు నచ్చాయి.
గంగూబాయి కథ గురించి ముంబయి ప్రజలకు బాగా తెలుసు. ఇతర భాషల వాళ్లు ఈ సినిమాను ఎలా
స్వీకరిస్తారని మీరు అనుకుంటున్నారు?
భాషా పరిమితులు లేకుండా ప్రతి ఒక్కరినీ కదిలించే విశ్వజనీనమైన కథాంశమిది. పరిస్థితుల ప్రభావంతో చీకటి ప్రపంచంలోకి నెట్ట్టివేయబడిన మహిళ గంగూబాయి. కామాటిపుర వీధుల్లో ఆమె ఎదుర్కొన్న సంఘర్షణ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని భావిస్తున్నా.
‘ఆర్ఆర్ఆర్’ ద్వారా తెలుగులో అరంగేట్రం చేశారు. భవిష్యత్తులో మీ నుంచి మరిన్ని సినిమాలు
ఆశించవచ్చా?
తెలుగులో చాలా సినిమాలు చేయాలని ఉంది. లో నటించడం మరిచిపోలేని అనుభూతి. కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కథానాయికగా నటించే అవకాశం గురించి ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఆ సినిమా విషయంలో నా నుంచి మీరు శుభవార్త వింటారనే అనుకుంటున్నా (నవ్వుతూ).
కళాధర్ రావు జూలపల్లి