ముంబై, అక్టోబర్ 21: ప్రస్తుత పండుగ సీజన్లో ఊపందుకున్న కొనుగోళ్లు, పెరిగిన వ్యాపారాలతో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఈ నెల (అక్టోబర్)కుగాను సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొన్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో మందగమనం ఏర్పడిందన్న ఆర్బీఐ.. పెరుగుతున్న డిమాండ్‌తో ఇప్పుడు అది తొలగిపోతున్నదని ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ పేరుతో బులెటిన్‌లో ప్రచురించిన ఆర్టికల్‌లో తెలియజేసింది. ముఖ్యంగా వ్యవసాయ రంగం ఆశాజనకంగా సాగుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్లలో ఒకరైన మైఖేల్ దేబబ్రత నాయకత్వంలోని బృందం రాసిన సదరు వ్యాసం వెల్లడించింది.
బ్యాంకింగ్ రంగంపై..
వ్యక్తిగత రుణాల మంజూరులో బ్యాంకులు నిబంధనల్ని కఠినతరం చేయడంతో రిటైల్ క్రెడిట్ వృద్ధిరేటు అంతంతమాత్రంగానే ఉన్నట్టు ఆర్బీఐ చెప్పింది. అయితే రుణాల్లో పెరుగుదల లేనప్పటికీ.. డిపాజిట్ల రేట్లు అధిక స్థాయిల్లోనే ఉండొచ్చని, ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గకపోవచ్చనే అభిప్రాయాన్నే రిజర్వ్ బ్యాంక్ వర్గాలు వ్యక్తం చేశాయి. ఇక డిజిటల్ పేమెంట్లు మరింత పెరగవచ్చన్న అంచనాలున్నాయి. ఈ పండుగ సీజన్లో ఆన్లైన్ షాపింగ్ జోరుగా సాగుతుండటం, ఈ-కామర్స్ లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటమే ఇందుకు కారణం. అలాగే ద్రవ్యవ్యవస్థలో ప్రస్తుతం నగదు చలామణి బాగానే ఉందని కూడా ఆర్బీఐ ఈ సందర్భంగా తెలియజేసింది.
రేట్ల పెంపుతోనే ధరలు తగ్గాయ్
వరుసగా వడ్డీరేట్లను పెంచుతూపోవడం వల్లే ధరలు తగ్గుముఖం పట్టాయని ఆర్బీఐ పేపర్ స్పష్టం చేసింది. 2022 మే నెల నుంచి రెపోరేటును పలుమార్లు 2.5 శాతం మేరకు పెంచారు. దీంతో ప్రధాన ద్రవ్యోల్బణం 1.60 శాతం మేర దిగొచ్చిందని ఆర్బీఐ సీనియర్లు రూపొందించిన పత్రం తెలియజేసింది. ఈ వరుస వడ్డింపులతోనే రెపోరేటు 6.5 శాతానికి చేరగా, టోకు-చిల్లర ద్రవ్యోల్బణాలు ఎంతకీ దిగిరాకపోవడంతో నిరుడు ఏప్రిల్ నుంచి రేట్లు అక్కడే ఉన్నాయి. సుదీర్ఘకాలం తర్వాత ఇటీవలి ద్రవ్యసమీక్షలోనే కఠిన వైఖరిని వీడుతున్నట్టు సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. దీంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్ల తగ్గింపునకు మార్గం సుగమమైంది.