
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కొందరు అధికారులు సొంత కార్లను కార్యాలయాలకు అద్దె వాహనాలుగా ఉపయోగిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతాధికారులకు వాహనాలను సమకూర్చే బాధ్యత సర్కార్‌పై ఉంటుంది. అయితే కొందరు కాసులకు కక్కుర్తి పడి బినామీ వెహికిల్ కాగితాలతో వారి వాహనాలనే అద్దెకు ఏర్పాటు చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. ట్యాక్స్ ప్లేటు వాహనాలనే నడపాలని నిబంధనలు ఉన్నా అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనేఆరోపణలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల తమ ఉపాధికి గండి కొడుతున్నారని హైర్ వెహికిల్స్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్, నవంబర్ 26: ప్రభుత్వ ఖాజానకు కొందరు అధికారులు గండి కొడుతున్నారు. సర్కారు కొలువు చేస్తూ ఉన్నత స్థాయిలో ఉండి కూడా అద్దె వాహనాలను ఉపయోగించకుండా కక్కుర్తి పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతాధికారులకు వివిధ పనుల నిమిత్తం వాహనాలను సమకూర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఈ క్రమంలో ట్యాక్స్ప్లేట్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి ఉపాధి లభిస్తుందనే ఆలోచనతో ప్రభుత్వం అద్దె వాహనాలను అధికారులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నది. అయితే కొందరు అధికారులు మాత్రం హైర్ వాహనాలను అద్దెకు తీసుకోకుండా ప్రభుత్వం కల్లుగప్పి తమ సొంత వాహనాలు వాడుతూ బిల్లులు సొమ్ముచేసుకుంటున్నారు. కొందరు అధికారులు తమ సొంత వాహనాలను ఉపయోగించుకుని అద్దె వాహనం కలిగిన వ్యక్తి నుంచి కాగితాలను తీసుకుని వివరాలను నమోదు చేస్తున్నారు. బిల్లులు వచ్చిన సమయంలో కాగితాలు ఇచ్చిన వ్యక్తి ఖాతాలో డబ్బులు జమ అయిన తరువాత లావాదేవీలను జరుపుతున్నారు. ఈ ప్రక్రియ అంతా సంబంధిత అధికారి తెలిసినా ఎవరూ నోరు మెదపడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.
అధికారులకు నోటీసులు జారీ..
హైర్ వాహనాల విషయమై కలెక్టర్ ఎస్.వెంకట్రావుకు అద్దె వాహనదారులు వినతిపత్రం అందజేయడంతో సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేశారు. అద్దె వాహనాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని, తప్పనిసరి అద్దె వాహనాలను ఉపయోగించుకోవాలని ఆదేశించారు.
మా కడుపు కొట్టొద్దు
అధికారులు అద్దె వాహనాలను తీసుకోవాలి. కార్యాలయాల్లో మా వాహనాలు నడుస్తాయి. అద్దె వాహనాలకు ప్రతి మూడు నెలలకోసారి ట్యాక్స్ చెల్లిస్తున్నాం. అధికారులు ట్యాక్స్ ప్లేట్ కల్గిన మా వాహనాలను తీసుకోవాలని విన్నవించాం. ఈ విషయంపై కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రం సమర్పించాం.