న్యూఢిల్లీ : వన్యప్రాణి పార్క్ ఉద్యోగిపై లైవ్ షోలో మొసలి దాడి చేసిన ఘటన దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది. 16 అడుగుల మొసలి జూకీపర్పైకి దూసుకురావడంతో అతడు గాయపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భయానక ఘటన క్వజులు నటాల్ ప్రావిన్స్‌లో సెప్టెంబర్ 10న జరిగింది.
ఘటన వివరాలను వైల్డ్ హార్ట్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ ఫేస్బుక్ పోస్ట్ చేసింది. రెండు మొసళ్లున్న ప్రదేశంలో జూకీపర్ సీన్ లి క్లస్ లైవ్‌షోలో భాగంగా హన్నిబల్ అనే మొసలిపై కూర్చుండగా ఒక్కసారిగా అది రెచ్చిపోయింది. గత ౩౦ ఏండ్లుగా ఆయన హన్నిబల్ బాగోగులు చూస్తున్నారు. హన్నిబల్‌పై ఉద్యోగి కూర్చున్న వెంటనే అది తలను వెనక్కితిప్పి దాడి చేసి పంటితో గాయపరిచింది.
దాంతో అతడు పరుగున దాని పట్టు నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తడం కనిపించింది. ఈ క్రమంలో లి క్లస్కు గాయాలయ్యాయి. వన్యప్రాణి పార్క్ ఉద్యోగిపై దాడి చేసిన 16 అడుగుల మొసలి బారి నుంచి అతడు తప్పించుకున్నాడని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు జూకీపర్‌పై సానుభూతి చూపగా క్రూర మృగాల పట్ల జాగ్రత్తగా ఉండాలని మరికొందరు నెటిజన్లు హెచ్చరించారు.