తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (Salakatla Brahmotsam) భాగంగా ఆదివారం సింహ వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ (TTD) ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి.
ఆంధ్ర రాష్ట్రంతో పాటు, పంజాబ్(Punjab), మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్టాలకు చెందిన 20 కళా బృందాలలో 530మంది కళాకారులు (Artists) వారి వారి కళారూపాలను ప్రదర్శించారు. చెన్నైకి చెందిన పద్మప్రియ, తిరుపతికి చెందిన హేమమాలిని బృందాలు ప్రదర్శించిన భరతనాట్యం(Bharatanatyam) , వివిధ వేషధారణలు, తమిళనాడుకు చెందిన సురేశ్ వైష్ణవ సుగుమాన్ బృందాలు ప్రదర్శించిన మోహిని అట్టం (Mohini Attam) విశేషంగా ఆకట్టుకున్నది.
బెంగళూరుకు చెందిన దివ్యశ్రీ బృందం ప్రదర్శించిన నరసింహ నమనం కళా ప్రదర్శన భాగవతంలోని నరసింహావతారాన్ని కనుల ముందు సాక్షాత్కరింపచేసింది. రాజమండ్రికి చెందిన ఉమారాణి బృందం ప్రదర్శించిన మయూరి నాగిని నృత్యం కనువిందు చేసింది. పంజాబ్ జానపద కళారూపమైన జూమర్ను పుష్కల బృందం ప్రదర్శించిన తీరు అబ్బుర పరిచింది. చెన్నైకి చెందిన ఉమామహేశ్వరి బృందం కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకున్నది. తిరుపతికి చెందిన డాక్టర్ వంశీధర్ చెంచులక్ష్మి బృందం నరసింహమూర్తి, ప్రహ్లాదుల రూపాలతో అలరించారు.