హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉద్యోగులకు హెల్త్ స్కీంను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పెండింగ్ జీపీఎఫ్, లీవ్ శాలరీ, మెడికల్ రియింబర్స్మెంట్ బిల్లులు, పెండింగ్ వాహన రవాణా భత్యాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): డీఎంఈ, డీపీహెచ్, టీవీవీపీ విభాగాల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. సచివాలయంలో బుధవారం వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తును కలిసి సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. జీవో 142ను రద్దు చేయాలని, సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ హెల్త్ కేర్ అలవెన్సు చెల్లించాలని పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్లకు వాహన సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు నరహరి, ప్రధాన కార్యదర్శి లాలూ ప్రసాద్ రాథోడ్, కోశాధికారి మహ్మద్ ఖాజా రౌఫుద్దీన్ తదితరులు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు.