హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : పీహెచ్డీ పూర్తిచేయాలంటే.. రీసెర్చ్ చేయాలి. వందల పేజీల థీసిస్ రాయాలి. దాన్ని ఆచార్యులు మూల్యాంక నం చేయాలి. అప్పుడు వర్సిటీ పీహెచ్డీ ప్రకటిస్తుంది. ఇక ఇలాంటి తంతుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) పుల్‌స్టాఫ్ పెట్టనున్నది. కొత్తగా ప్రొడక్ట్ బేస్డ్ పీహెచ్‌డీలకు విద్యాసంస్థ శ్రీకారం చుట్టనున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రొడక్ట్ బేస్డ్ పీహెచ్‌డీలను ప్రవేశపెట్టనున్నట్టు ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి సోమవారం వెల్లడించారు.
ప్రొడక్ట్ బేస్డ్ పీహెచ్‌డీలను ఇన్నోవేషన్ పీహెచ్‌డీలుగా పిలుస్తారు. దీంట్లో రీసెర్చ్ స్కాలర్లు థీసిస్ రాయకుండా ఏదో ఒక ప్రొడక్ట్ రూపొందించాలి. వాణిజ్యపరంగా లాభదాయకమైన ఆవిష్కరణ డెవలప్చేయాలి. చైనాలో ఈ పద్ధతి అనుసరిస్తున్నారు. తయారుచేసిన భౌతిక నమూనాలకు పేటెంట్ హక్కులు పొందవచ్చు. ప్రాజెక్ట్ ఆధారంగానే పీహెచ్‌డీలు ప్రదానం చేస్తారు.
కొత్తగా ఐఐటీహెచ్‌లో ఎంటెక్ మూవీ మేకింగ్ కోర్సు ప్రవేశపెట్టనున్నట్టు బీఎస్ మూర్తి తెలిపారు. సినిమా నిర్మాణంలోని ఏడు ప్రధాన దశలపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. స్క్రిప్ట్ రాయడం, నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్స్ అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన ఎంటెక్ టెక్నో ఆంత్రప్రెన్యూర్‌షిప్ కోర్సు విజయవంతమయ్యిందని పేర్కొన్నారు.