గౌహతి: అస్సాంలో ఉన్న గౌహతి ఐఐటీ(IIT Guwahati)లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఐఐటీ గౌహతి క్యాంపస్‌లో వందల సంఖ్యలో రీసర్చ్ స్కాలర్లు, ఎంటెక్ విద్యార్థులు మంగళవారం ప్రదర్శన నిర్వహించారు. అత్యధిక స్థాయిలో ఫీజుల్ని పెంచినట్లు ఆరోపించారు. పీహెచ్డీ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఫీజు పెంచేశారు. దీంతో పాటు బీటెక్, ఎంటెక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు కూడా ఫీజు పెంచినట్లు తెలుస్తోంది. జూలై 17వ తేదీన విద్యార్థులు, మేనేజ్మెంట్ మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఫీజు పెంచడం లేదని అంగీకరించినట్లు తెలుస్తోంది.
జూలై 22వ తేదీన జూలై-నవంబర్‌కు చెందిన సెమిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఫీజు చెల్లించకుండా సెమిస్టర్ రిజిస్ట్రేషన్ జరగదు. కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఐఐటీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే మంగళవారం సంబంధిత శాఖలకు వెళ్లిన రీసర్చ్ స్కాలర్ విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించకపోవడంతో రిజిస్ట్రేషన్ జరగలేదు. దీంతో విద్యార్థులు నిరసన చేపట్టారు.
ఐఐటీ గౌహతి వర్గాల ప్రకారం పీహెచ్డీ విద్యార్థులకు ఫీజును 10 వేలు పెంచారు. జులై-నవంబర్ సెమిస్టర్‌కు ఆ ఫీజు వసూల్ చేయనున్నారు. జనవరి-మే సెమిస్టర్‌కు రూ.34,800 ఉన్న ఫీజు ఇప్పుడు 45,700 అయ్యింది. కొత్తగా విద్యార్థులు పెరిగిన ఫీజులో భాగంగా సుమారు 92 వేలు చెల్లించనున్నారు. తమ స్టైఫండ్ కన్నా 20 వేలు అధిక ఫీజు చెల్లించాల్సి వస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక పార్ట్‌టైం స్కాలర్లు ఫీజు 2500 నుంచి 25వేలకు పెంచారు. పీహెచ్డీ విద్యార్థులకు హౌజ్ రెంట్ అలవెన్స్ రాదు అని, అదనంగా హాస్టల్ ఫీజు చెల్లించాల్సి వస్తోందని విద్యార్తులు చెబుతున్నారు.
మెస్ ఫీజు కూడా చాలా ఎక్కువగా పెరిగిందని, 2019లో 12 వేలు ఉన్న ఆ ఫీజు ఇప్పుడు 22వేలు అయ్యిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆహారం నాణ్యత పెరగకున్నా.. ఫీజు మాత్రం బాగా పెంచేసినట్లు చెప్పారు. జింఖానా ఫీజు, మెడికల్ ఫీజు, హాస్టల్ రెంట్ పెరిగినట్లు విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్నా.. ఐఐటీ అధికారులు స్పందించడం లేదు.