ఇచ్చోడ : అటవీ అధికారులు( Forest Officials ) పోడు రైతుల జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ( MLA Anil Jadhav ) అన్నారు. మండలంలోని కేశవ్ పట్నం, బాబ్జీపేట్ పోడు రైతులను అటవీ అధికారులు కొన్ని రోజులుగా ఇబ్బందులు పెడుతున్నారంటూ శనివారం బాబ్జీపేట్ వద్ద రైతులతో కలిసి ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని , అందరికి పోడు పట్టాలు అందిస్తామన్నారు.
పోడు రైతులను ఇబ్బందులు పెడితే సహించబోమని, అవసరం అయితే రైతుల కోసం ఎంతకైనా తెగిస్తామని అన్నారు. వెంటనే రైతులను ఇబ్బందులు పెట్టడం మానేసి వెనక్కి వెళ్లిపోవాలని అటవీ అధికారులకు సూచించారు. తమ కోసం రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యేపై పోడు రైతులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.