
సిటీబ్యూరో, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): అర్ధరాత్రి వేళ రెక్కీ నిర్వహిస్తారు.. రోడ్లపై పార్కింగ్ చేసే కార్లను గుర్తిస్తారు.. స్పాట్లోనే నకిలీ తాళం చెవి తయారు చేసి.. తస్కరిస్తారు.. కొద్ది దూరం వెళ్లగానే నంబర్ ప్లేట్లు మార్చేస్తారు.. ఆ తర్వాత అమ్మేస్తారు.. మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా, మారుతీ, హూందాయ్ కార్లను మాత్రమే తస్కరించే ముఠా గుట్టు రట్టయింది. నిందితుల నుంచి రూ. 50 లక్షలు విలువ చేసే 8 కారులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం నేరేడ్మెట్ రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో అదనపు పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించిన వివరాల ప్రకారం..నాచారం, మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల మారుతీ ఎర్టిగ, స్విఫ్ట్ డిజైర్ కార్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు, కాల్ డాటా ఆధారంగా నిందితులను గుర్తించారు. మల్కాజిగిరి పోలీసులు శుక్రవారం నిందితులు ఇమ్రాన్ ఖాన్ పఠాన్, సంతోష్ జగనాథ్ పవార్‌ను కుషాయిగూడ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని విచారించారు. తమతో పాటు మరో నలుగురు ఉన్నారని వెల్లడించారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
స్పాట్లోనే తాళం చెవి తయారీ…
మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్‌ఖాన్ పఠాన్, సంతోష్ జగనాథ్ పవార్ కుషాయిగూడ కాప్రా భరత్ ఫంక్షన్ హాల్ వద్ద అద్దెకు ఉంటున్నారు. అర్ధరాత్రి సమయంలో రోడ్లపై పార్కింగ్ చేసే వాహనాలను గుర్తిస్తారు. 12 గంటలు దాటిన తర్వాత.. వాటి సైడ్ డోర్ల అద్దాలు పగులగొట్టి.. సెంట్రల్ లాకింగ్ కనెక్షన్‌ను తెంపేస్తారు. తాళం చెవిని పెట్టి..లాక్‌లో దింపుతారు. తాళం చెవిపై పడిన మార్కులతో అక్కడే 20 నిమిషాల్లో డూప్లికేట్ కీని తయారు చేసి.. తాపీగా కారును తీసుకెళ్తారు. కొద్ది దూరం వెళ్లాక నంబర్ ప్లేట్లను మార్చి..మహారాష్ట్ర నంబరు ప్లేట్‌ను పెట్టుకొని.. మన రాష్ట్ర సరిహద్దును దాటేసి.. అక్కడ ఉన్న గ్యారేజ్ వారికి అమ్మేస్తారు.
దేశవ్యాప్తంగా..
ఇమ్రాన్ ఖాన్ పఠాన్, సంతోష్ జగనాథ్ పవార్‌లతో పాటు ఫర్మాన్ అలీ ఖాన్, సోహ్రాబ్ అలీ, యెవీరుల్లా ఖాన్, ఉదయ్ మారుతి పాటిల్ కలిసి దేశవ్యాప్తంగా కార్ల చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ ముఠా 50 వాహనాలను దొంగలించినట్లు తేలింది. ఈ ముఠాకు ఉదయ్ మారుతి పాటిల్ గ్యాంగ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కారు ఇంజిన్, చాసిస్..
ఈ ముఠా చోరీ వాహనాలను అమ్మేందుకు కొన్ని కారు గ్యారేజీలతో లింక్ పెట్టుకుంటున్నాయి. గ్యారేజీల్లో ఏండ్ల తరబడి పడి ఉన్న వాహనాల నంబర్లు, వాటి చాసిస్, ఇంజిన్ నంబర్లను తస్కరించిన కార్లకు పెట్టి..అమ్మేస్తారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న మారుతి, హుందాయ్ కార్లనే టార్గెట్ చేస్తుంది.