ఏ పనికైనా సమర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంలో చెప్పిన సామెత ఇది. అసమర్థులను, అవినీతి నేపథ్యం ఉన్నవారిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే.. కుటిల బుద్ధినే ప్రదర్శిస్తారు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. ఏ మనిషికైనా జుట్టే అలంకరణ. వృద్ధాప్యంలోనూ జుట్టు సంరక్షణకు ఎన్నో చర్యలు తీసుకుంటాం. పేలను తొలగించుకునేందుకు ఎన్నో పద్ధతులు అవలంబిస్తాం. లేకపోతే వెంట్రుకలను కొరికేస్తాయి. కేశ సంపదను హరిస్తాయి. అలాంటి పేనుకే జుట్టు సంరక్షణ బాధ్యత అప్పగిస్తే.. ఇంకేముంది తిరు క్షవరమే!
పసుపు పూసుకుంటవా అత్తా!
ఈ పదబంధానికి, ఉమ్మడి కుటుంబంలోని అత్తా కోడళ్లకు విడదీయరాని బంధం ఉంది. అత్తా కోడళ్లు పసుపు పూసుకోవడం వేరు.. రాత్రిళ్లు పసుపు పూసుకోవడం వేరు. ఈ రెండిటికీ తేడా తెలియాలంటే.. ‘అత్తా అత్తా పసుపు పూసుకుంటవా!’అనే పదబంధం గురించి తెలియాలి. పూర్వం నుంచీ కొందరు అత్తాకోడళ్లకు పడదు. ఇద్దరి మధ్యా సఖ్యత చెడితే ఒకరిపై మరొకరు అలిగి ఒక్కోపూట పస్తులు ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలోనే ఇద్దరూ ఓ రోజు గొడవ పెట్టుకుంటారు. అత్త తన కోడలిపై అలిగి అన్నం తినకుండా పడుకుంటుంది. ఉద్యోగం ముగించుకొని వచ్చిన కొడుకు ‘మా అమ్మ తిన్నదా?’ అంటే.. ‘లేదు నేను పెడితే వద్దూ అంటున్నది’ అని భార్య చెబుతుంది. ‘నాకెందుకో అనుమానంగా ఉంది. ఇప్పుడు వెళ్లి మా అమ్మను అడుగు’అంటాడు. భయంగానే వెళ్లిన కోడలు ఆమె చెవిలో ‘అత్తా.. అత్తా పసుపు పూసుకుంటావా’ అని అడుగుతుంది. ‘నాకేం వద్దు’ అని చిరాకుగా అరిచి పడుకుంటుంది అత్త. అది విన్న కొడుకు తల్లికి ఆకలి లేదేమోనని అనుకుంటాడు.
ఇంట్లకు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్లు
కుటిలాత్ములను ఎప్పటికీ చేరదీయకూడదు. ఆదమరిచి ఆశ్రయం కల్పిస్తే మొదటికే మోసం వస్తుందని జానపదులు అనుభవపూర్వకంగా చెప్పిన సామెత ఇది. ఈ తరహా వ్యక్తులు అక్కడక్కడా తారసపడుతూ ఉంటారు. ఇలాంటివారిపై జాలి, దయ ప్రదర్శించకూడదు. నమ్మి ఏ పని అప్పగించినా సర్వనాశనమే. అంతా తమదేనని చెబుతారు. విశ్వాసమే ఉండదు.
డప్పు రవి