హైదరాబాద్, జూలై 21: పురుషుల ఊబకాయం వారి వీర్య కణాల సంఖ్య క్షీణతపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కాలిఫోర్నియా రివర్సైడ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్లో ప్రచురితమయ్యాయి. ఊబకాయుల సంఖ్య పెరుగుతున్న భారత్లో ఈ సమస్య ప్రభావం ఎక్కువని తెలిపింది. దక్షిణాదిలో ఈ సమస్య మరీ ఎక్కువని వెల్లడించింది. మగవారిలో ఊబకాయానికి, లైంగిక గ్రంథులు తక్కువగా హార్మోన్లు విడుదల చేయడానికి సంబంధం ఉందని.. ఇది టెస్టోస్టిరాన్ స్థాయిని, వీర్య కణాల సంఖ్యను తగ్గిస్తుందని తెలిపింది.
మెదడులోని కీలక భాగమైన హైపోథాలమస్ సంతానోత్పత్తిని నియంత్రిస్తుందని.. సంతానోత్పత్తికి అవసరమైన హార్మోన్లను విడుదల చేసే పిట్యూటరీ గ్రంథిని ప్రభావితం చేస్తుందని తాజా పరిశోధన వివరించింది. ఎక్కువ కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల హైపోథాలమస్లో నిరంతర మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. ఈ మార్పుల వల్ల టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గుతుందని.. ఇది వీర్య కణాల క్షీణతపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. ఎలుకలపై ఈ అధ్యయనం నిర్వహించినట్టు పరిశోధకులు తెలిపారు.