న్యూఢిల్లీ, జనవరి 10: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల చార్జీలను పెద్ద ఎత్తున పెంచింది. చెల్లింపులు ఆలస్యమైతే గరిష్ఠంగా రూ.1,200 వరకు జరిమానా ఉంటుందని స్పష్టం చేసింది. వచ్చే నెల 10 నుంచి ఈ నిర్ణయాలు వర్తిస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. అన్ని క్రెడిట్ కార్డుల కస్టమర్లు క్యాష్ అడ్వాన్స్‌పై 2.5 శాతం లావాదేవీ చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎంల్లో నగదు తీసుకోవడాన్నే క్యాష్ అడ్వాన్స్ అంటారు. ఈ నగదుపై తొలిరోజు నుంచే వడ్డీరేటు పడుతూ ఉంటుంది.
ఇక విదేశీ ప్రయాణాల్లో ఆయా దేశాల కరెన్సీని తీసుకుంటే అదనపు లావాదేవీ ఫీజులూ పడుతాయి. కాబట్టి అత్యవసరమైతే తప్ప క్రెడిట్ కార్డుల ద్వారా ఫారిన్ ఎక్సేంజ్ క్యాష్‌ను తీసుకోకపోవడమే మంచిది. అలాగే చిన్నచిన్న మొత్తాలను ఎక్కువసార్లు తీసినా అధిక ఫిక్స్డ్ చార్జీలుంటాయి. కాగా, తాజా సవరణల నేపథ్యంలో క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల్లో విఫలమైతే సదరు కార్డును ఇంకా వాడకపోవడమే ఉత్తమం. అలాగే చెల్లింపులను ఈఎంఐగా మార్చుకోవడం, వ్యక్తిగత రుణం ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడం తెలివైన పని అని నిపుణులు సూచిస్తున్నారు.