ముంబై : సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) నేతృత్వంలోని భారత జట్టు.. 2026 టీ20 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఆ టోర్నీ తర్వాత జరిగిన టీ20 సిరీస్‌లో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించారు. బీసీసీఐ సెలెక్టర్లు తమ నిర్ణయంతో క్రికెట్ ఫాలోవర్స్‌కు షాక్ ఇచ్చారు. సూర్య స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ప్రకటించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు శ్రేయాస్ సారధ్య బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే భారత జట్టుకు టీ20 వరల్డ్‌కప్ అందించిన సూర్యకుమార్‌ను అకస్మాత్తుగా ఎందుకు తొలగించారో ఎవరికీ అర్థం కాలేదు. ఆ అంశంపై సూర్య మౌనం వీడారు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో జరిగిన చాటింగ్‌లో ముంబై బ్యాటర్ తన మనోగతాన్ని వివరించారు. జట్టు నుంచి తనను తొలగించిన తర్వాత తనకు నవ్వే మిగిలిందన్నాడు. రాబోయే ఒలింపిక్స్ క్రీడలతో పాటు టీ20 వరల్డ్‌కప్‌కు కూడా కెప్టెన్సీ చేపడుతానని ముందుగా అనుకున్నట్లు చెప్పాడు. కానీ సెలెక్టర్లు మాత్రం తమ నిర్ణయంతో షాక్ ఇచ్చినట్లు చెప్పాడు. కొత్త జట్టులో తన పేరు లేనప్పుడు నవ్వు వచ్చిందని, జాతీయ జట్టుతో ఆడుతున్నప్పుడు వత్తిడి సమయంలో తాను అలాగే చేస్తుంటానన్నాడు. ఎప్పుడూ స్మైల్ ఇస్తుంటానని, రిలాక్స్ అవుతానన్నాడు.
అకస్మాత్తుగా జట్టు నుంచి తొలగిస్తారని అనుకోలేదని సూర్య అన్నాడు. కనీసం మరో రెండేళ్ల పాటు ఈ జట్టుతో ముందుకు వెళ్తానని భావించానన్నాడు. ముందు ఒలింపిక్స్, ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్ ఆడుతానని అనుకున్నట్లు చెప్పాడు. కానీ సెలెక్టర్లు మరోలా వ్యవహరించినట్లు తెలిపాడు. వ్యక్తుల అభిప్రాయాలను గౌరవించడం ముఖ్యమన్నాడు. సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం పట్ల తానేమీ రియాక్ట్ కాలేదన్నారు. ఆ క్షణంలో సెలెక్టర్లు ఆ నిర్ణయం తీసుకున్నారని, మరో కెప్టెన్ నేతృత్వంలోని టీమ్ బాగా పర్ఫార్మ్ చేస్తే దాంట్లో సమస్యలేదన్నాడు.
సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్టును పరిశీలించానని, శ్రేయాస్తోనూ చాలా క్రికెట్ ఆడానని, అతను మంచి ప్లేయర్ అని తెలుసు, మంచి వ్యక్తి కూడా, మంచి కెప్టెన్ కూడా. కానీ అతన్ని ఎందుకు కెప్టెన్‌గా ప్రకటించారో తెలియదని, సెలెక్టర్ల నిర్ణయంతో తాను కొంత నిరాశకు లోనైనట్లు సూర్య అంగీకరించాడు. ఎందుకంటే రెండేళ్లలో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదని, వరల్డ్‌కప్‌తో పాటు ఆసియాకప్ కూడా గెలిచామని, ఆ సమయంలో ఇలాగే ముందుకు సాగాలని ఆశించానని, అన్నీ సవ్యంగా సాగుతున్న క్షణంలో, అకస్మాత్తుగా మార్పు ఎందుకు అని, దానికి కారణం ఏంటో, మార్పునకు కారణం ఏంటో తెలియదన్నాడు.
తనకు ఇదే అంశంపై ఆలోచనలు వస్తున్నట్లు సూర్య తెలిపాడు. అసలు ఇలా ఎందుకు జరిగింది, ఎలా సాధ్యమైందన్న కోణంలో ఆలోచిస్తున్నానన్నాడు. వరల్డ్‌కప్ గెలిచాము, వ్యక్తిగతంగా ఐపీఎల్లో ఆశించినంతగా రాణించలేదని, నెల రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నట్లు చెప్పాడు. జట్టును ప్రకటించడానికి రెండు రోజుల ముందు సెలెక్టర్లతో తనతో మాట్లాడినట్లు చెప్పాడు. ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని సెలెక్టర్లు తనకు చెప్పినట్లు సూర్య తెలిపాడు.