Lax Gopishetty : నేపాల్ (Nepal) ను అతలాకుతలం చేస్తున్న ఆకస్మిక వరదల్లో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) కు చెందిన ఉన్నతాధికారి గల్లంతయ్యారు. ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ అయిన ‘ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ (Infosys Public Services)’ హెడ్‌గా పనిచేస్తున్న లక్ష్ గోపిశెట్టి (Lax Gopishetty) .. వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లారు. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన వరదల తర్వాత ఆయన ఆచూకీ లభించడం లేదని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయనను గుర్తించి, క్షేమంగా తీసుకురావడమే తమ కర్తవ్యమని కంపెనీ స్పష్టంచేసింది.
ఈ ఘటనపై ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. “మా సహోద్యోగి లక్ష్ గోపిశెట్టి వ్యక్తిగత పర్యటనపై ఆ ప్రాంతానికి వెళ్లారు. ప్రస్తుతం ఆయనతో సంబంధాలు తెగిపోయాయి. ఆయన ఆచూకీని కనుగొనడానికి, కాంటాక్ట్ ఏర్పాటు చేయడానికి సంబంధిత ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నాం. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబంతో నిరంతరం టచ్‌లో ఉంటూ, అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నాం. లక్ష్ క్షేమంగా ఉండాలని, ఈ విషాదం బారిన పడిన వారందరూ సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నాం” అని పేర్కొన్నది.
అమెరికా, కెనడాలోని ప్రభుత్వ రంగ ప్రాజెక్టులపై ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. మరోవైపు ఈ వరదల తీవ్రతపై భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) కీలక వివరాలు వెల్లడించింది. ఈ విపత్తులో సుమారు 320 మంది భారతీయుల ఆచూకీ గల్లంతైందని, మరో 400 మంది చైనా వైపున చిక్కుకుపోయారని తెలిపింది. చైనా వైపు చిక్కుకున్న వారిలో 153 మంది సురక్షితంగా నేపాల్‌కు చేరుకున్నారని పేర్కొన్నది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి కాఠ్మండుకు చేరుకున్న 21 మంది భారతీయులు నిన్న మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు.
లక్ష్ గోపిశెట్టి నేపథ్యం చూస్తే.. ఆయనకు టెక్నాలజీ రంగంలో అపారమైన అనుభవం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యూహం, టెక్నాలజీ, కార్యకలాపాలు, పరివర్తన వంటి అంశాలపై ఆయన సలహాలు అందిస్తుంటారు. ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ వ్యూహరచన, అమలులో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుత బాధ్యతలకు ముందు ఆయన ఇన్ఫోసిస్‌లోనే గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌గా, బిజినెస్ అప్లికేషన్స్ హెడ్‌గా అమెరికా, యూరప్, ఆసియా అంతటా వ్యాపారాన్ని విస్తరించారు. ఇన్ఫోసిస్‌లో చేరడానికి ముందు ఆయన యాక్సెంచర్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా, అంతకుముందు వివిధ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.