ఇంకా ఎదగాలనే ఆలోచనతో ఉన్నత చదువుల కోసం స్కాలర్‌షిప్‌తో అమెరికాకు వెళ్లింది ఈ హైదరాబాద్ అమ్మాయి. ఓ రోజు ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. చామన ఛాయ.. అందమైన పలువరుస.. కలువల్లాంటి కళ్లు… చురుకైన చూపులు గుర్తించి ఫ్యాషన్ ఇండస్ట్రీ ఆమెను ఆహ్వానించింది. ఏడాది గడిచింది.. ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ కవర్ స్టార్ అయింది. ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ చానెల్‌కి అంబాసిడర్‌గా ఎదిగింది. ఇప్పుడు ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాకెక్కింది. అంతర్జాతీయ వేదికలపై అతి తక్కువ కాలంలో అద్భుత విజయాలు సాధిస్తూ సంచలనాలు సృష్టిస్తున్న ఆ హైదరాబాద్ అమ్మాయి పేరు భవిత మండవ.
ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇటీవల ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితా ప్రకటించింది. అందులో ఓ తెలుగమ్మాయి భవిత మండవ పేరు కనిపించింది. ఎన్నడూ వినని పేరు, చూడని ముఖం హఠాత్తుగా వార్తల్లో కనిపిస్తే ఎవరీమె? అని భారతీయులు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. మనవాళ్లు ఆమె గురించి తెలుసుకునే లోపే పాశ్చాత్య ప్రపంచం తన అందాన్ని, దానికి తగ్గ ప్రతిభని గుర్తించింది. ప్రపంచ ష్యాషన్ వేదికలపై తారలా మెరిసిన ఆ అమ్మాయి ప్రఖ్యాత మేగజైన్లపై కవర్ ఫొటోలతో అలరించింది. ప్రపంచ మార్కెట్లో పేరున్న ష్యాషన్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా పని చేస్తున్నది. హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వరకు చదువు కోసం సాగిన ప్రయాణంలో అనుకోకుండా అందాల ప్రపంచంలోని అడుగుపెట్టి, అనూహ్య విజయాలు సాధించిన ఈ సౌందర్య రాశి ఎవరు? ఏమిటీ ఈమె స్టోరీ?
భవిత పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లో. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ బ్యాచిలర్ డిగ్రీ సాధించింది. హైదరాబాద్‌లోనే ఓ కంపెనీలో కొంతకాలం పని చేసింది. కొన్ని నెలల తర్వాత బెంగళూరులోని ఓ ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. కొన్నేళ్లకు ఆ ఉద్యోగం వదిలిపెట్టి ఉన్నత విద్య కోసం అమెరికా చేరింది. న్యూయార్క్ యూనివర్సిటీ మెరిట్ స్కాలర్షిప్ సాధించింది. అక్కడ ఇంటెగ్రేటెడ్ డిజైన్ అండ్ మీడియా, హ్యుమన్ కంప్యూటర్ ఇంటెరాక్షన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరింది.

చదువు కోసం అమెరికాకు వెళ్లిన భవిత ఓ రోజు తన స్నేహితురాలి కోసం సబ్వేలో ఎదురు చూడసాగింది. ఆ సమయంలో ఒక మాడలింగ్ ఏజెంట్ భవితను గమనించాడు. తన శరీర సౌందర్యమే కాదు అందమైన నవ్వు, నడకలో హుందాతనం చూసి, మీకు ఫ్యాషన్ రంగంలో మంచి అవకాశాలు ఉంటాయని సలహా ఇచ్చాడు. ఆ పరిచయంతో 2024లో భవిత ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆర్కిటెక్ట్ చదివిన భవిత మాడలింగ్లో అనుకోకుండా అడుగుపెట్టింది. దానిని సీరియస్‌గా తీసుకోలేదు. అమెరికాలో చదువుకునే రోజుల్లో సరదాగా గడపొచ్చని భావించింది.
భవిత జీవితాన్ని అమెరికా కొత్త మలుపు తిప్పింది. ష్యాషన్ రంగానికి చెందినవాళ్లు ఆమెలోని ప్రత్యేకతను గుర్తించారు. ‘బొట్టెగా వెనెటా ఫ్యాషన్ షో’కి ఆమెను ఎంపిక చేసుకున్నారు. వాళ్ల సూచనలు, సహకారంతో భవిత ర్యాంప్‌పై అడుగుపెట్టింది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ షోలలో క్యాట్‌వాక్ దాకా ఆమె ప్రయాణం సాగింది. ఇండస్ట్రీలో ఈ అమ్మాయిని చూసి.. ‘భలే చాన్స్ కొట్టేసిందే’ అనే టాక్ వచ్చింది! సరదా ప్రయాణం కొద్ది రోజుల్లోనే ఎంతోమంది మాడల్స్ చేరుకోలేని మైలు రాయిదాకా నడిపిస్తుందని ఆమె కూడా ఊహించలేదు. క్రిస్టియన్ డియోర్, చానెల్ వంటి ప్రఖ్యాత బ్రాండ్ల ఫ్యాషన్ షోలలో అవకాశం రావడంతో అత్యంత వేగంగా ఆమె పాపులారిటీ సాధించింది. అంతర్జాతీయ మీడియా దృష్టిలో పడింది. కొద్ది రోజుల్లోనే పెద్ద ఫ్యాషన్ షో కోసం ఎంపికవడంతో భవిత ఈ కెరీర్‌ని సీరియస్‌గా తీసుకొని, జెట్ స్పీడ్‌తో దూసుకుపోయింది.
‘Met Gala 2026’ షో ద్వారా భవిత వార్తల్లోకెక్కింది. ఈ షోలో ఆమె ధరించిన ప్యాంట్ ఎంతోమందిని ఆకట్టుకుంది. మస్లిన్, సిల్క్ దారాలతో తయారు చేసిన ఈ జీన్స్ వార్తల్లోకి ఎక్కడంతో చర్చ మొదలైంది. ఆ దుస్తుల్లో ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రఖ్యాత ఫ్యాషన్ మేగజైన్ వోగ్ 2026 మార్చి సంచికలో కవర్ స్టార్‌గా భవిత ఫ్యాషన్ ప్రియులకు మరింత చేరువైంది. ఈ పత్రిక ముఖచిత్రంపై కనిపించిన అతి కొద్దిమంది భారతీయ మాడళ్లలో ఆమె ఒకరు. అందాల ప్రపచంలో భవితకు ఉన్న ఆదరణను గుర్తించి చానెల్ సంస్థ ‘హౌస్ అంబాసిడర్’గా నియమించుకుంది. ఈ అవకాశం అందుకున్న తొలి భారతీయ మాడల్ తనే కావడం విశేషం. ఇది తనకే కాదు భారతీయ మాడళ్లకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు.

అందానికి చర్మం రంగు ఒక ప్రమాణంగా చూసే మన సమాజంలో చామన ఛాయకు ఫ్యాషన్ ప్రపంచంలోనే కాదు సాధారణ జీవితంలోనూ చిన్న చూపే. కానీ, ఆ చామన ఛాయ అందమే ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో తళుకులీనుతున్నది. అందరూ ఎదుర్కొన్నట్టే చిన్నప్పుడు భవిత కూడా మేని రంగు గురించి అవహేళనకు గురైందట. కానీ, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగిపోయింది. అందాల ప్రపంచంలో ఎంతోకాలం శ్రమిస్తే చేరుకునే మైలురాళ్లెన్నో కెరీర్ ఆదిలోనే అందుకుంది. అందం, ప్రతిభ, సహనంతో చేరుకున్న విజయతీరాల్లో ఆమె క్యాట్‌వాక్ చేస్తుంటే ఆ షోని ఇంట్లో ఉండి చూస్తూ ఆనందబాష్పాలు కార్చిన అమ్మానాన్నల వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. భారత్ నుంచి వచ్చిన కొత్త సూపర్ మాడల్‌గా ఫ్యాషన్ ప్రపంచం భవిత గురించి
చెప్పుకుంటున్నది.